ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన స్టార్ డైరెక్ట‌ర్!

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ `డాన్ 3` చుట్టూ కొన్నాళ్ల‌గా ఉన్న‌ సందిగ్ధతకు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఎట్టకేలకు తెరదించారు.;

Update: 2026-04-28 09:30 GMT

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ `డాన్ 3` చుట్టూ కొన్నాళ్ల‌గా ఉన్న‌ సందిగ్ధతకు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఎట్టకేలకు తెరదించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి హీరో రణవీర్ సింగ్ తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్‌ను ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక వివాదం ఈ సినిమాను వెంటాడుతూనే ఉంది. అయితే ఈ పుకార్లపై ఇంతకాలం మౌనంగా ఉన్న ఫర్హాన్ తాజాగా ఇచ్చిన వివరణతో అభిమానుల్లో ఉన్న గందరగోళం తొలగిపోయింది. రణవీర్ సింగ్ ఈ సినిమా నుండి వైదొలిగారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఫర్హాన్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు.

`రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకో లేదు. ఆయనే మా డాన్ అని తేల్చి చెప్పారు. భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందు స్క్రిప్ట్ వర్క్ - ప్రీ-ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందని ఆ గ్యాప్‌లో వ‌చ్చే అసత్య ప్రచారాలను న‌మ్మొద్ద‌ని కోరారు. రణవీర్ సింగ్ అంకితభావంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అమితాబ‌చ్చ‌న్, షారుఖ్ ఖాన్ లాంటి దిగ్గజ నటులు పోషించిన ఐకానిక్ పాత్రను రణవీర్ సింగ్‌కు అప్పగించడంపై సోషల్ మీడియాలో భిన్నా భిప్రాయా లు వ్యక్తమయ్యాయి. ఈ ఒత్తిడి కారణంగానే రణవీర్ వెనక్కి తగ్గుతున్నారని కొందరు ప్రచారం చేశారు. కానీ ఫర్హాన్ అక్తర్ మాత్రం రణవీర్ ఎనర్జీ, స్టైల్ డాన్ పాత్రకు కొత్త ఊపిరి పోస్తాయని బలంగా నమ్ముతున్నార‌ని ఆయ‌న మాట‌ల‌తో అర్ద‌మ‌వుతుంది.

ప్రస్తుత తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ర‌ణ‌వీర్ డాన్ పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ కూడా త‌ప్పుకుంద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. కానీ కియారా ఎగ్జిట్ అవ్వ‌లేద‌ని చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రణవీర్ - కియారా జంట‌ను సరికొత్త యాక్షన్ ప్రపంచంలోకి తీసుకొస్తున్నామంటూ చెబుతున్నారు. స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. అయితే సినిమా ప‌ట్టాలెక్క‌డానికి మాత్రం చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాదే ప్రారంభించాల‌ని టీమ్ ఉన్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించుతున్నారు. `డాన్`, `డాన్ 2` చిత్రాలు సృష్టించిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మూడవ భాగాన్ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ర‌ణ‌వీర్ సింగ్-ప‌ర్హాన్ అక్త‌ర్ వేర్వేరు క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉండ‌టంతో ఈ ఏడాది సాద్య‌మ‌య్యే చిత్రంగా క‌నిపించ‌లేదు. అయితే `ధురంద‌ర్ 2` రిలీజ్ త‌ర్వాత ర‌ణ‌వీర్ సింగ్ ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. `ఇమ్మెర్ట‌ల్ అశ్వ‌థామ` అనే చిత్రంలో ర‌ణ‌వీర్ సింగ్ం న‌టిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Tags:    

Similar News