సమంత మీద ప్రేమతో అభిమాని ఏం చేశాడంటే
ఆమె మంచి మనసుతో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటూ ఇతర కార్యక్రమాలు చూసి ఆమె చేసే మంచి పనుల్ని అనుసరిస్తూ వస్తున్నాడు.;
కొందరు ఫ్యాన్స్ వారి అభిమాన నటీనటులపై చూపించే ప్రేమ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అయితే తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. కొందరు రక్త దానం చేస్తే, ఇంకొందరు దానధర్మాలు చేస్తారు. మరికొందరు అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొంతమంది వారి ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని వెల్లిబుచ్చుతూ ఉంటారు.
అదే అభిమానం కొన్ని సార్లు దైవత్వంగా కూడా మారుతుంటుంది. అలాంటప్పుడు తాము అభిమానించే వారికి గుడులు కట్టి పూజలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఓ అభిమాని అలానే చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన ఆలపాడు గ్రామంలో ఉండే సందీప్, తాను ఎంతగానో అభిమానించే సమంతకు గుడి కట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఓ హీరోయిన్ కు గుడి కట్టడం ఇదే మొదటిసారి.
గతంలో తమిళనాడులో ఖుష్బూ, నమిత లాంటి హీరోయిన్లకు అక్కడి ఫ్యాన్స్ గుడులు కట్టిన సంగతి తెలిసిందే. కారు డ్రైవర్ గా పని చేస్తున్న సందీప్, సమంతకు వీరాభిమాని. అయితే తన అభిమానాన్ని అందరిలా కాకుండా డిఫరెంట్ గా చూపించాలనే ఆలోచనతో సందీప్ తన ఇంటి ఆవరణలోనే సమంతకు గుడి కట్టి ఆమె విగ్రహానికి రోజూ పూజలు చేస్తున్నాడట.
ఏ మాయ చేసావే టైమ్ నుంచే సమంతకు పెద్ద ఫ్యాన్ గా మారిన సందీప్, ఆమె మంచి మనసుతో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటూ ఇతర కార్యక్రమాలు చూసి ఆమె చేసే మంచి పనుల్ని అనుసరిస్తూ వస్తున్నాడు. ఆమెపై ఉన్న అభిమానాన్ని తెలపడానికి సొంత డబ్బుతో సమంతకు గుడి కట్టి అక్కడ పూజలు చేస్తూ ఆందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అయితే ఈ గుడి ఇటీవల కట్టిందేమీ కాదు, సందీప్ ఈ గుడిని ఎప్పుడో కట్టి, 2023లో సమంత బర్త్ డే రోజున ప్రారంభించాడు. కానీ ఇప్పటివరకు ఆ విషయం బయటకు రాలేదు. సమంతపై సందీప్ కు ఉన్న అభిమానాన్ని, భక్తిని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు సమంతను ఇంత పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో సమంత ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.