సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర పరిధి ఎంత?
| సినిమా నిర్మాణంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రధానంగా షూటింగ్ షెడ్యూల్స్, వెండర్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ విభాగాల సమన్వయాన్ని పర్యవేక్షిస్తారు. బిల్లులు, వోచర్లను పరిశీలించి చెల్లింపులకు సిఫార్సు చేస్తారు. అయితే భారీ మొత్తాల విడుదల, పారితోషికాలు, ఇతర కీలక చెల్లింపులకు సాధారణంగా నిర్మాత లేదా సంస్థ ఫైనాన్స్ విభాగం ఆమోదం అవసరం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు ఆర్థిక అధికారాలు ఉన్నాయా లేదా అన్నదే నిధుల దుర్వినియోగం కేసుల్లో కీలకంగా మారుతుంది.
ఇటీవల ఒక అగ్ర నిర్మాణ సంస్థకు చెందిన భారీ ప్రాజెక్ట్‌లో దాదాపు 4 కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతపై సదరు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడం సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేపింది. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు, నిధుల విడుదల .. చెల్లింపుల ఆమోద ప్రక్రియలో ఎగ్జిక్యూటివ్ నిర్మాతకు నేరుగా ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనతో అసలు సినిమా నిర్మాణంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాత్ర ఏమిటి? అతడి అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది? ఆర్థిక చెల్లింపులలో ఈ పాత్ర ఎంతవరకు పరిమితం? అనే అంశాలపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది.
సాధారణంగా పెద్ద నిర్మాణ సంస్థలలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే నిధుల నిర్వహణ.. లీగల్ కాంట్రాక్టులు.. కార్పొరేట్ డీల్స్.. ప్రాజెక్ట్ బడ్జెటింగ్‌ను పర్యవేక్షించే ఒక ఉన్నతాధికారి మాత్రమే. సినిమా సెట్స్‌పై లేదా ప్రీ-ప్రొడక్షన్ దశలో పనులు సజావుగా సాగడానికి అవసరమైన ప్లానింగ్ చేయడం... పలు విభాగాల మధ్య సమన్వయం సాధించడం అతడి ప్రధాన బాధ్యత. కొన్నిసార్లు లైన్ ప్రొడ్యూసర్‌తో కలిసి లేదా ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌ను కోఆర్డినేట్ చేసేందుకు కన్సల్టెంట్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ను నియమించుకుంటారు. వీరు షూటింగ్ షెడ్యూల్స్.. వెండర్ మేనేజ్‌మెంట్.. దైనందిన నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు.
అయితే చాలామంది భావిస్తున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ నిర్మాతకు నిధులు మంజూరు చేసే అధికారం పూర్తిగా ఉండదు. కోట్లాది రూపాయల పెద్ద ఫండ్స్, పారితోషికాలు, వీఎఫ్ఎక్స్ ఏజెన్సీలు లేదా భారీ వెండర్ల చెల్లింపుల బాధ్యత నేరుగా ప్రధాన నిర్మాతలదే. ప్రొడక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేవలం బిల్లులను, వోచర్లను పరిశీలించి చెల్లింపుకు సిఫార్సు చేస్తారే తప్ప నేరుగా బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు విడుదల చేసే సైనింగ్ ఆథరైజేషన్ వారికి ఉండదు. ప్రతీ పెద్ద చెల్లింపు కూడా ప్రధాన నిర్మాత .. కంపెనీ ఫైనాన్స్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) బృందం పరిశీలించి అనుమతించిన తర్వాతే జరుగుతుంది.
నిర్మాణ సంస్థలు విధించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్.వో.పీ) ప్రకారం రోజువారీ షూటింగ్ అవసరాలు, చిన్నపాటి ఖర్చుల నిర్వహణ మాత్రమే ప్రొడక్షన్ టీమ్ ద్వారా జరుగుతుంది. ఏదైనా భారీ మొత్తం విడుదల కావాలంటే అది కచ్చితంగా ప్రధాన నిర్మాత ఆమోదంతోనే సాధ్యమవుతుంది. అందుకే ఆర్థికపరమైన తప్పిదాలు లేదా నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు సంబంధిత వ్యక్తికి చెల్లింపులు ఆమోదించే చట్టబద్ధమైన అధికారం ఉందా లేదా అనేది లీగల్‌గా అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది ప్రొడక్షన్ నిర్వహణను సమర్థవంతంగా నడిపించే ఒక బాధ్యతాయుతమైన పదవి మాత్రమే. అతడు చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేవలం కార్పొరేట్, ఆన్-గ్రౌండ్ పనులను ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి తప్ప సొంతంగా కోట్లాది రూపాయల నిధులను మళ్లించే లేదా విడుదల చేసే ఫైనాన్షియల్ పవర్స్ అతడికి ఉండవు. అందుకే కోర్టులు కూడా ఆర్థిక నేరాల విచారణలో ఎస్ఓపి నిబంధనలు, ఆమోద ముద్ర వేసే అధికార పరిధి ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంటాయి. దర్మ ప్రొడక్షన్స్ నాగ్ జిల్లా చిత్రీకరణ సమయంలో తలెత్తిన వివాదంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాతలపై ఫిర్యాదులు అందగా విచారణ జరుగుతోంది. ఈ విచారణలో తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.