మిర్జాపూర్.. ఎపిక్ కంటిన్యూ చేస్తుందా?

ఓటీటీలో హిట్ అయిన కథను థియేటర్‌కు తీసుకొస్తే ప్రేక్షకుడు టికెట్ కొంటాడా అనే సందేహానికి మిర్జాపూర్ ది మూవీ ప్రస్తుతం మంచి ఫలితాన్నే ఇస్తోంది.

Update: 2026-09-09 04:42 GMT

ఓటీటీలో హిట్ అయిన కథను థియేటర్‌కు తీసుకొస్తే ప్రేక్షకుడు టికెట్ కొంటాడా అనే సందేహానికి మిర్జాపూర్ ది మూవీ ప్రస్తుతం మంచి ఫలితాన్నే ఇస్తోంది. మూడు సీజన్లుగా ఇంట్లో చూసిన కాలీన్ భయ్యా, గుడ్డు, మున్నా పాత్రలను సినిమా రూపంలోకి తీసుకొస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. టాక్ పూర్తిగా ఒకేలా లేకపోయినా ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.177 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇప్పుడు తెలుగులో ఇదే రూట్‌లో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ వస్తోంది.

ఎపిక్‌కు బేస్ 90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్. ఓటీటీలో హిట్ అయిన ఆ సిరీస్‌లో చిన్నవాడిగా కనిపించిన ఆదిత్య ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతని కాలేజ్, ప్రేమకథను సినిమాగా తీసుకొస్తున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్. శివాజీ, వాసుకి కూడా అదే తల్లిదండ్రుల పాత్రల్లో కొనసాగుతున్నారు. అంటే కొత్త పేరుతో సినిమా చేస్తున్నా, ప్రేక్షకుడికి ముందే తెలిసిన కుటుంబంలోనే కథ మొదలవుతుంది.

మిర్జాపూర్‌కు ఈ మార్పు కొంచెం ఈజీ అయింది. అక్కడ యాక్షన్, క్రైమ్, బలమైన పాత్రలు ఉన్నాయి. వాటిని పెద్ద స్క్రీన్‌కు తీసుకెళ్లడానికి కావాల్సిన స్కేల్ కూడా దొరికింది. ఎపిక్ దగ్గర పరిస్థితి వేరు. 90స్ బలం మధ్యతరగతి ఇంట్లో జరిగే చిన్న విషయాలు. ఆ ఫీలింగ్‌ను థియేటర్ సినిమాకు సరిపోయేలా పెద్ద కథగా మార్చడం ఆదిత్య ముందున్న పని.

దీనికి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ మరో బలం. బేబీ తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో 90స్ చూడని ప్రేక్షకుడికి కూడా ఒక తెలిసిన జంట ఉంది. అదే సమయంలో పాత సిరీస్ చూసిన వాళ్లు శివాజీ, వాసుకి కుటుంబం కోసం వస్తారు. ఇలా రెండు వేర్వేరు రూట్లో ఎపిక్ థియేటర్లలోకి వెళ్తోంది.

అయితే ఓటీటీ హిట్ అనే పేరు ఒక్కటే సరిపోదు. ఇంట్లో ఎపిసోడ్లుగా చూసే కథకు ప్రేక్షకుడు సమయం ఇస్తాడు. థియేటర్‌కు వచ్చాక రెండు మూడు గంటల్లోనే ప్రేమ, కుటుంబం, ఎమోషన్ అన్నీ పని చేయాలి. పైగా 90స్‌తో ఉన్న పోలికను దాటాలి. ఆనంద్, వైష్ణవిని చూసి ప్రతి సీన్‌లో బేబీ గుర్తొచ్చే పరిస్థితి కూడా రాకూడదు.

మిర్జాపూర్ ఒక టెన్షన్ తీర్చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 11న ఎపిక్ ముందుకు వస్తోంది. అక్కడ గ్యాంగ్‌స్టర్లు ప్రేక్షకులను తీసుకొచ్చారు. ఇక్కడ ఒక మధ్యతరగతి కుటుంబం, కాలేజ్ ప్రేమకథ వర్కౌట్ అవ్వాలి. ఆదిత్య హాసన్‌కు తర్వాత ఫైనల్ సెమిస్టర్, 90స్‌లోని ఇతర పిల్లల కథలు కూడా చెప్పాలనే ప్లాన్ ఉంది. అయితే ఎపిక్ రిజల్ట్ బాగుంటే అవి త్వరగా రావచ్చు.

Tags:    

Similar News