'గ్రౌండ్ జీరో' మూవీ.. పబ్లిక్ టాక్ ఇలా..
మరి యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్రౌండ్ జీరో మూవీ సంగతేంటి? కథేంటి? సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది?;
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్ లో ఆ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పటికే ఈ ఏడాదిలో ఆ జోనర్ లో పలు సినిమాలు తెరకెక్కగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటించిన గ్రౌండ్ జోరో మూవీ థియేటర్లలో విడుదలైంది.
బీఎస్ ఎఫ్ అధికారి నరేంద్ర నాథ్ ధర్ దూబే నేతృత్వంలో.. ఉగ్రవాది రాణా తాహిర్ నదీమ్ అకా ఘాజీ బాబా హత్యకు గురైన ఆపరేషన్ ఆధారంగా సినిమాను తేజస్ ప్రభ డియోస్కర్ తెరకెక్కించారు. మరి యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్రౌండ్ జీరో మూవీ సంగతేంటి? కథేంటి? సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
కశ్మీర్ లోయలో బీఎస్ ఎఫ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నరేంద్ర నాథ్ ధర్ దూబే (ఇమ్రాన్ హష్మి), స్థానిక కళాశాలలో చదువుతున్న విద్యార్థి హుస్సేన్ (మీర్ మెహ్రూజ్) సహాయంతో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఘాజీ బాబాను కనుగొనడంలో ఆధారాన్ని దక్కించుకుంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలిసి ఆపరేషన్ చేపడతారు. కానీ అది ఫెయిల్ అవుతుంది. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమా.
అయితే నరేంద్ర నాథ్ ధర్ దూబే పాత్రలో ఇమ్రాన్ హష్మీ బాగా నటించారని అంతా కొనియాడుతున్నారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించారని చెబుతున్నారు. జయ దూబే పాత్రలో సాయి తమంహంకర్ షో అద్భుతంగా యాక్ట్ చేసిందని, మీర్ మెహ్రూజ్ నటన బాగుందని అంటున్నారు. ముఖేష్ తివారీస, రాహుల్ వోహ్రా రోల్స్ అక్కడక్కడ సెట్ అయినట్లు అనిపించలేదని చెబుతున్నారు.
క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, కమల్జీత్ నేగి సినిమాటోగ్రఫీ బాగుందని కామెంట్లు పెడుతున్నారు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో సినిమా కాగా.. ఆయన తన కెమెరాతో అందమైన ప్రాంతాలు చాలా బాగా బంధించారని అంటున్నారు. సంచిత్ గుప్తా, ప్రియదర్శి శ్రీవాస్తవ రాసిన సంభాషణలు ప్రత్యేకంగా ఉన్నాయని చెబుతున్నారు. ఆకట్టుకున్నాయని అంటున్నారు.
మెయిన్ గా సినిమాలో క్లైమాక్స్, ఆలోచనలను రేకెత్తించే సంభాషణలతోపాటు సున్నితమైన అంశాన్ని డీల్ చేయడంలో డైరెక్టర్ చూపించిన సమతుల్య విధానం.. సూపర్ అని సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే మూవీ కాస్త స్లోగా ఉందని, డాక్యుమెంటరీ తీసినట్లు అనిపించిందని అంటున్నారు. కానీ దేశభక్తి భావన కల్పించే సినిమాగా గ్రౌండ్ జీరోను కొనియాడుతున్నారు.