నెల ముందే బుకింగ్స్... అయినా రెస్పాన్స్ జీరో?

బాలీవుడ్‌లో కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడల్లా స్టార్ పవర్, మార్కెటింగ్, హైప్.. ఇవి మూడూ కలిసి పనిచేస్తేనే ఓపెనింగ్ బలంగా ఉంటుంద‌నే భావన ఉంది.;

Update: 2026-04-30 06:00 GMT

బాలీవుడ్‌లో కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడల్లా స్టార్ పవర్, మార్కెటింగ్, హైప్.. ఇవి మూడూ కలిసి పనిచేస్తేనే ఓపెనింగ్ బలంగా ఉంటుంద‌నే భావన ఉంది. అయితే ఈ మే 1న రిలీజ్ కు రెడీ అయిన ఏక్ దిన్ మూవీ మాత్రం ఆ సమీకరణాన్ని పూర్తిగా ప్రశ్నిస్తోంది. సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ, ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ న‌టిస్తున్నారు. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో కం ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాను నిర్మించారు. ఇంత స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ, ఏక్ దిన్ ఆశించిన స్థాయిలో బజ్‌ను సృష్టించలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు ఓపెన్ చేసే బుకింగ్స్‌ను ఈ సినిమా కోసం దాదాపు ఒక నెల ముందే ప్రారంభించారు. అయినప్పటికీ, ఆ స్ట్రాటజీ పెద్దగా రిజ‌ల్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. బుకింగ్స్ డల్‌గా ఉండటం, ఓపెనింగ్ రూ.1- రూ.2 కోట్ల మధ్యే ఉండొచ్చన్న అంచనాలు వినిపించడం.. ఇవ‌న్నీ కలిపి ఏక్ దిన్ పై ఉన్న క్రేజ్ ఎంత తక్కువగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు హైప్ లేకుండా రిలీజ్ అవుతున్న మూవీ అనే ట్యాగ్ అంటుకుంది.

ఇక డెబ్యూ యాంగిల్ చూస్తే, సాయి పల్లవి వంటి నేచురల్ టాలెంట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఒక పెద్ద ప్లస్‌గా భావించాలి. అదే సమయంలో జునైద్ ఖాన్‌కు ఇది కీలకమైన మొదటి అడుగు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో వెనుకబడింది. దీన్ని బ‌ట్టి చూసుకుంటే, పేరు, బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఆడియ‌న్స్ ను క‌నెక్ట్ చేయ‌డానికి స‌రిపోవు, దానికి తోడు ప్రేక్ష‌కులు ఎట్రాక్ట్ అయ్యే కంటెంట్ కూడా కావాల‌నే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

ఆమిర్ ఖాన్ ఫ్యాక్టర్ కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తోంది. బాలీవుడ్‌లో కంటెంట్ డ్రివెన్ సినిమాలకు ఆమిర్ బ్రాండ్ ఓ నమ్మకం. కానీ ఈసారి ఆ బ్రాండ్ కూడా ఓపెనింగ్ బజ్‌ను తీసుకురాలేకపోయింది. మార్కెటింగ్ ప‌రంగా చూస్తే, ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేయడం, ప్రమోషన్స్ చేయడం.. ఇలా అన్ని ఎఫ‌ర్ట్స్ ఉన్న‌ప్ప‌టికీ, అవి ఆడియన్స్‌లో ఆసక్తిని రేపలేకపోవడం స్ట్రాటజీ బ్యాక్‌ఫైర్ అయిందా? అనే సందేహాన్ని క‌లిగిస్తోంది.

అయితే, ఈ కథ ఇక్కడితో ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటు అవుతుంది. ఆమిర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇది స్లోగా పిక్ అవుతుందని భావిస్తున్నారు. మార్నింగ్ షో త‌ర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే, ఏక్ దిన్ మెల్లిగా ర‌న్ ను పెంచుకునే అవ‌కాశాలు లేక‌పోలేదు. మ‌రి ఆమిర్ అంచ‌నాల్ని, న‌మ్మ‌కాన్ని ఏక్ దిన్ సినిమా ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలి.

Tags:    

Similar News