ENE2: తరుణ్ భాస్కర్ తట్టుకోలేనంతలా అంచనాలు ఉన్నాయా?
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ కల్ట్ చిత్రం ఈ నగరానికి ఏమైంది గురించి తెలిసిందే.;
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ కల్ట్ చిత్రం ఈ నగరానికి ఏమైంది గురించి తెలిసిందే. విడుదల సమయంలో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. మెల్లగా ఆ సినిమా యూత్ లో కల్ట్ స్టేటస్ ను సంపాదించుకుంది. నలుగురు స్నేహితుల మధ్య ఉన్న బాండింగ్, వారి లైఫ్ లో జరిగే సరదా సంఘటనలు, కాలేజ్ రోజుల జ్ఞాపకాలు.. అన్నీ కలిసి ఆ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.
విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా యూత్ ఆ సినిమాతో బాగా కనెక్ట్ అయింది. నేటికీ చాలామంది ఆ మూవీలోని పాత్రల్లో తమను తాము చూసుకుంటామని చెప్పడం సినిమాకు ఉన్న ప్రభావాన్ని చూపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా ఆ సినిమాకు సీక్వెల్ తీసుకురావాలని అభిమానులు కోరుతూ వస్తున్నారు. వారి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తరుణ్ భాస్కర్ ఇప్పటికే సీక్వెల్ ను ప్రకటించారు. ENE2 (ఈఎన్‌ఈ2) పేరుతో రూపొందుతున్న ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రముఖ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ప్రస్తుతం ఆ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే, ఆ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు ఊపందుకున్నాయి. యూత్ ఆడియన్స్ ఆ సినిమాను ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో కొందరు యువకులు ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.
అందులో వారు ENE2 పై ఉన్న భారీ అంచనాలను ప్రస్తావించారు. ఆ వీడియోకు రెస్పాండ్ అయిన తరుణ్ భాస్కర్ సరదాగా కామెంట్ చేస్తూ, "సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉండటంతో ఒత్తిడితో చచ్చిపోతున్నా" అని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తరుణ్ భాస్కర్ కామెంట్ ఫన్నీగానే ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ పై ఉన్న ఒత్తిడి ఎంత ఉందో అర్థమవుతోంది. ఎందుకంటే మొదటి భాగం కల్ట్ క్లాసిక్ గా నిలిచిన తర్వాత, సీక్వెల్ పై ప్రేక్షకుల అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ తమ జీవితానికి దగ్గరగా భావించడంతో, రెండో భాగం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగింది.
మొత్తంగా చూస్తే.. ఈ నగరానికి ఏమైంది 2 పై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. కథ, పాత్రలు, హాస్యం.. అన్నీ విషయాల్లో ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయితే, తరుణ్ భాస్కర్ తన ప్రత్యేక శైలితో ఆ సీక్వెల్ ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఆ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.