'లక్కీ భాస్కర్' అక్కడి వరకు వెళ్లాడా?
దుల్కర్ సల్మాన్ సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సొంతం చేసుకున్నాడు.
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఐయామ్ గేమ్'. మలయాళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు, కానీ దుల్కర్ సల్మాన్ సినిమాలను ఇష్టపడేవారు ఐయామ్ గేమ్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి, మౌత్ పబ్లిసిటీ దక్కితే రెగ్యులర్ ఆడియన్స్ థియేటర్ల బాట పట్టే అవకాశం ఉంది. దుల్కర్ సల్మాన్ సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సొంతం చేసుకున్నాడు. రామ్ గా, భాస్కర్‌గా దుల్కర్ కనబర్చిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు దుల్కర్‌లో రామ్ ను చూసుకుంటున్నారు.
దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ మూవీ....
ఐయామ్ గేమ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు తాను తన కెరీర్‌లో సీతారామం సినిమా బెస్ట్ మూవీ అనుకున్నాను. కానీ విదేశాలకు వెళ్లినా, ఎక్కడ ఉన్నా ఎక్కువ శాతం మంది నన్ను లక్కీ భాస్కర్‌గా గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఆ మధ్య సినిమా షూటింగ్ కోసం బుడాపెస్ట్‌కు వెళ్లిన సమయంలో చాలా మంది స్థానికులు నన్ను గుర్తించారు. అక్కడి వారు చాలా మంది నా వద్దకు వచ్చి భాస్కర్ కదా అంటూ పలకరించారు. కొందరు కొంత సమయం చూసిన తర్వాత లక్కీ భాస్కర్ వీడియోలు చూపించి ఇది మీరే కదా అని ప్రశ్నించారు. చాలా మంది నన్ను లక్కీ భాస్కర్ పేరుతో గుర్తించడం ఆశ్చర్యంగా అనిపించిందని స్వయంగా సదరు ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్...
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా కమర్షియల్‌గా గొప్ప భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు. రికార్డ్‌లు బద్దలు కొట్టలేదు, కలెక్షన్స్‌తో కాసుల వర్షం కురిపించలేదు. మీడియం రేంజ్‌లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అయితే ఓటీటీలో సినిమాను చూసిన వారు చాలా మంది గొప్ప మూవీ అని కితాబిచ్చారు. సినిమా థియేటర్లలో ఉన్న సమయంలో చేయాల్సిన పబ్లిసిటీ చేయలేదు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వచ్చిన టాక్‌కి, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్న మాటలకు అప్పుడు వచ్చిన కలెక్షన్స్‌కి అసలు సంబంధం లేదు అన్నట్లు కొందరు బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సినిమా మంచి కంటెంట్‌తో వచ్చిన సమయంలో మంచి పబ్లిసిటీ అవసరం అనే విషయాన్ని ఆ సమయంలో మేకర్స్ పట్టించుకోలేదా ఏంటి అంటూ కొందరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
లక్కీ భాస్కర్ సీక్వెల్ గురించి...
విదేశాల్లోనూ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే లక్కీ భాస్కర్ ఏ స్థాయి వరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుల్కర్ సల్మాన్ తానే నమ్మలేనంత దూరం లక్కీ భాస్కర్ వెళ్లింది. చాలా మంది ప్రేక్షకులు సినిమాను ఓటీటీలో చూసి ఫిదా అయ్యారు. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు దుల్కర్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా లక్కీ భాస్కర్ ను చెబుతున్నారు. ఇప్పటి వరకు సీతారామం సినిమా తన బెస్ట్ మూవీ అనుకున్న దుల్కర్ సైతం ఇప్పుడు తన కెరీర్ బెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ అని అనుకునే స్థాయిలో సినిమా చాలా దూరం వెళ్ళింది. ఇప్పటికీ ఇంకా సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. ఒక సామాన్యుడు తన కుటుంబం కోసం చేసే ఆర్థిక నేరం నేపథ్యంలో సాగే సినిమా లక్కీ భాస్కర్. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ ను చేస్తాను అంటూ దర్శకుడు వెంకీ ప్రకటించాడు. అయితే ఇప్పటికి ఇప్పుడు ఆ సీక్వెల్ ఉండదని మాత్రం చెప్పాడు.