వేలాది మందికి `కర` నిర్మాత ఉచిత వైద్య సేవలు
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన `కర` (KARA) చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన `కర` (KARA) చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినీపరిశ్రమతో పాతిక సినిమాల అనుబంధం కలిగి ఉన్న ఆయన, విద్యా రంగంలోను అజేయంగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాలతో తనకు దశాబ్ద కాలంగా విద్యా, వైద్య రంగాల్లో అనుబంధం ఉందని గుర్తుచేశారు. ముఖ్యంగా వికారాబాద్‌లోని `మహావీర్ మెడికల్ కాలేజ్` ద్వారా ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా రోగులకు.. అలాగే నిజామాబాద్‌లోని `మేఘన డెంటల్ కాలేజ్` ద్వారా మరో 200 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకకు విచ్చేసిన సాయి ధరమ్ తేజ్ తమ విద్యా సంస్థలోనే చదువుకున్నారని.. అతడిని నేడు పెద్ద హీరోగా చూడటం సంతోషంగా ఉందని నిర్మాత పేర్కొన్నారు.
సినిమా విశేషాల గురించి చెబుతూ.. `కర` చిత్రం ప్రతి ఒక్కరి దైనందిన జీవితానికి దగ్గరగా ఉంటుందని.. ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమాను ఎవరూ మిస్ అవ్వవద్దని కోరారు. హీరో ధనుష్ ఈ చిత్రంలో కేవలం నటించడమే కాకుండా.. ఆ పాత్రలో జీవించారని కొనియాడారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన దర్శకులు వెంకీ అట్లూరి, బుచ్చిబాబులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ధనుష్‌తో నేరుగా ఒక తెలుగు సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. తన కుమార్తె కుశితకు ఇది మొదటి సినిమా అని.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటిలాగే తమ ఆదరణను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నిర్మాతగా కుశిత గణేష్ అరంగేట్రం:
సహ నిర్మాత కుషిత గణేష్ ఈ వేదికపై మాట్లాడుతూ.. నిర్మాతగా తన తొలి అడుగును ధనుష్ వంటి గొప్ప నటుడి సినిమాతో వేయడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. తన తండ్రి డాక్టర్ ఇషారి కె. గణేష్ అడుగుజాడల్లో నడుస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ కథను ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారని... నటీనటులు మమితా, జయరామ్ సహా సాంకేతిక నిపుణులందరూ ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని కొనియాడారు.
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తారని... తమ సినిమా `కర`కు కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందని కుశిత ధీమా వ్యక్తం చేశారు. వేడుకకు విచ్చేసిన సాయి ధరమ్ తేజ్, బుచ్చిబాబు, వెంకీ అట్లూరిల రాకతో ఈ ఈవెంట్‌కు నిండుదనం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ కాకుండా చూడాలని.. తమ మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కుషిత గణేష్ విన్నవించారు.