మూవీ రివ్యూ : డోంట్ ట్రబుల్ ద ట్రబుల్

మలయాళంలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్.. తెలుగులో తొలిసారి లీడ్ రోల్ చేసిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.

Update: 2026-10-02 04:09 GMT

‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ మూవీ రివ్యూ

నటీనటులు: ఫాహద్ ఫాజిల్- బేబీ సారా పాలేకర్- మహేష్ మంజ్రేకర్- వెంకటేష్ కాకుమాను- సౌరభ్ సచ్ దేవ్- సుబ్బరాజు- శశాంక్- దివ్య పిళ్ళై తదితరులు

సంగీతం: కాలభైరవ

ఛాయాగ్రహణం: బ్రాడ్ ఫ్రాన్సిస్

నిర్మాతలు: ఎస్ఎస్ కార్తికేయ- శోభు యార్లగడ్డ

రచన-దర్శకత్వం: శశాంక్ యేలేటి

మలయాళంలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్.. తెలుగులో తొలిసారి లీడ్ రోల్ చేసిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ.. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కలిసి ప్రొడ్యూస్ చేయడం.. జక్కన్న కుటుంబం దీన్ని గట్టిగా ప్రమోట్ చేయడంతో హైప్ బాగానే వచ్చింది. మరి ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఈ హైప్ కు తగ్గ సినిమానేనా? తెలుసుకుందాం పదండి.

కథ:

సూరి (ఫాహద్ ఫాజిల్) ఒక అనాథ. డబ్బు కోసం ఏమైనా చేసే రకం. మనుషులకు మస్కా కొట్టి బతికే అతను.. తాను చేసిన ఒక మోసం వల్ల ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. రెండు రోజుల్లో 25 లక్షలు కట్టకపోతే తన ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఎంత ప్రయత్నించినా డబ్బులు చిక్కని పరిస్థితుల్లో పిల్లల్ని కిడ్నాప్ చేయడమే మార్గం అనుకుంటాడు. ఈ క్రమంలోనే దివ్య అనే అమ్మాయి (సారా పాలేకర్)ను కిడ్నాప్ చేసి.. తన కుటుంబ సభ్యుల్ని బెదిరించడం మొదలుపెడతారు. కానీ తన ప్లాన్ వర్కవుట్ కాదు. అందుక్కారణం దివ్య మామూలు అమ్మాయి కాదు. తనొక ఆత్మ అని కొంచెం లేటుగా సూరికి అర్థమవుతుంది. ఇంతకీ ఈ దివ్య కథేంటి? ఆత్మ అయినా సూరికి ఎందుకు కనిపిస్తోంది? తన పర్పస్ ఏంటి? దాన్ని సూరి నెరవేర్చాడా? ఇంతకీ తన సమస్యలు తీర్చుకున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఫాంటసీ కథల్ని సరిగా డీల్ చేస్తే.. భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. లాజిక్ తో సంబంధం లేకుండా ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. ప్రేక్షకులను ఒక ఊహాలోకంలో విహరింపజేసి వినోదంలో ముంచెత్తొచ్చు. కాకపోతే.. ఈ కథలు కోకొల్లలుగా చూశాం కాబట్టి కథనంలో ఏదో ఒక మ్యాజిక్ జరిగేలా చూసుకోవాలి. ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవాలి. ఎమోషన్ కూడా పండేలా చూసుకోవాలి. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’లో కొంతమేర ఆ ప్రయత్నం జరిగింది. కొన్ని క్రేజీ సీన్లతో వినోదాన్ని పంచగలిగారు. లీడ్ క్యారెక్టర్లు బాగున్నాయి.. వాటిని పోషించిన ఆర్టిస్టులూ ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఎమోషన్ కూడా కొంత వర్కవుట్ అయింది. కానీ మరీ ప్రెడిక్టబుల్ గా ఉండే కథ.. కొన్ని ఇల్లాజికల్ సీన్లు.. సరిగ్గా కుదరని పేఆఫ్ వల్ల మ్యాజిక్ పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. ‘డోంట్ ట్రబుల్..’ ఆశించినంత గొప్ప సినిమా కాదు. అలా అని తీసిపడేసేలానూ లేదు. మిశ్రమానుభూతిని కలిగిస్తుంది.

ఆత్మకు ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ను నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తితో కనెక్ట్ అయి ట్రావెల్ చేస్తుంది. ఆ వ్యక్తికి మాత్రమే ఆత్మ కనిపిస్తుంది. ఈ లైన్ ‘దేవిపుత్రుడు’.. ‘ఎందుకంటే ప్రేమంట’.. రీసెంటుగా వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇలా చాలా సినిమాల్లో చూసిందే. పై చిత్రాలకు..‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు తేడా ఏంటంటే ఇది పూర్తిగా వినోదం లక్ష్యంగా సాగే సినిమా. డబ్బు కోసం పిల్లల్ని కిడ్నాప్ చేయాలని చూసే వ్యక్తి.. తనకు మాత్రమే కనిపించే ఒక చిన్నారి ఆత్మను మామూలు మనిషే అనుకుని కిడ్నాప్ చేస్తే? ఆసక్తి రేకెత్తించే ఈ పాయింట్ మీద ఒక దశ వరకు కథనాన్ని బాగానే నడిపించాడు కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి. ఓవైపు హీరో పాపను ఆత్మ అని గుర్తించలేకపోతే.. ఇంకోవైపు ఆ పాపకు కూడా అసలు విషయం తెలియక హీరోనే ఏదో మ్యాజిక్ చేసి తనకు స్పెషల్ పవర్స్ ఇచ్చాడనుకోవడం.. ఇలా గమ్మత్తైన స్క్రీన్ ప్లే లాక్ తో ప్రథమార్ధాన్ని వినోదాత్మక సన్నివేశాలతో నడిపించాడు శశాంక్. స్లో స్టార్ట్ తర్వాత కథలోకి ఆత్మ ప్రవేశించిన దగ్గర్నుంచి ‘డోంట్ ట్రబుల్..’ వేగం పుంజుకుంటుంది. కొన్ని సీన్లు క్రేజీగా అనిపిస్తాయి. ముఖ్యంగా హీరోకు అసలు విషయం అర్థమయ్యే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా పేలింది. ఇక్కడ ఫాహద్ ఫాజిల్ పెర్ఫామెన్స్ కూడా భలేగా అనిపిస్తుంది.

కానీ ద్వితీయార్ధంలో మాత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ నిరాశపరుస్తుంది. ప్రథమార్ధం ఉన్న ఫన్ అంతా ఉన్నట్లుండి మాయమైపోతుంది. కథలో పెద్దగా సర్ప్రైజులు లేకుండా.. చాలా సాధారణమైన సన్నివేశాలతో నడించే ద్వితీయార్ధం ఎంగేజింగ్ గా అనిపించదు. సుదీర్ఘంగా సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ బోర్ కొట్టిస్తుంది. ఆ సీన్ పర్పస్ ఏంటో అర్థం కాదు. హీరో-పాప మధ్య బలమైన బాండింగ్ ను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఎమోషన్ పండించడానికి అవకాశముండేది. కానీ అది జరగకపోవడం.. చివర్లో పేఆఫ్ సరిగా కుదరకపోవడంతో పతాక సన్నివేశాల్లో ఎమోషన్ అంతగా వర్కవుట్ కాలేదు. పాప తల్లిదండ్రులకు సంబంధించి ఇందులో పెట్టిన ఒక ఎపిసోడ్ ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. హీరో-పాప పాత్రలకు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ బాగున్నా.. అక్కడ భావోద్వేగాలు పండలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ కొంతమేర వినోదాన్ని పంచినా.. అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. రాజమౌళి ఆమోదించిన స్క్రిప్ట్.. కార్తికేయ సహా ఆయన ఫ్యామిలీలో చాలామంది ఇన్వాల్వ్ అయిన సినిమా నుంచి ఇంకా చాలా ఆశిస్తాం.

నటీనటులు:

ఫాహద్ ఫాజిల్ పెర్ఫామెన్స్ లో లోపమేమీ లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ సహా కొన్ని ఎపిసోడ్లలో అదరగొట్టేశాడు. ఒక దశ వరకు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ను తన భుజాల మీద మోస్తూ వినోదాన్ని పండించాడు. ఎక్కువగా సీరియస్ పాత్రలు చేసే అతను.. ఇందులో కామెడీ బాగా చేశాడు. ఎమోషనల్ సీన్లలో కూడా ఆకట్టుకున్నాడు. కాకపోతే కృత్రిమంగా అనిపించే తన డబ్బింగ్ మాత్రం మైనస్ అయింది. దాని వల్ల పాత్ర అనుభూతి దెబ్బ తింది. దివ్య పాత్రలో నటించిన చిన్న పాప సారా పాలేకర్ తో కూడా ఇదే సమస్య. ఆ పాప చూడ్డానికి బాగున్నా.. తన పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకున్నా.. యాస మాత్రం తేడాకొట్టింది. ఈ ఇద్దరికి తెలుగు వాళ్లతో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ‘యానిమాల్’ ఫేమ్ సౌరభ్ సచ్ దేవ్ బాగా చేశాడు. సుబ్బరాజు పర్వాలేదు. మహేష్ మంజ్రేకర్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆయన చేసిన పాతబస్తీ డాన్ పాత్ర తేలిపోయింది. హీరో ఫ్రెండు పాత్రలో వెంకటేష్ కాకుమాను ఓకే. శశాంక్.. దివ్య పిళ్ళైలకు పెద్దగా స్కోప్ లేకపోయింది.

సాంకేతిక వర్గం:

‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. కాలభైరవ మనసుపెట్టి మ్యూజిక్ చేశాడు. బిట్ సాంగ్స్ తప్పితే.. పూర్తి స్థాయి పాటలు లేని సినిమాలో బీజీఎం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాలను వీలైనంత మేర కాలభైరవ ఎలివేట్ చేశాడు. బ్రాడ్ ఫ్రాన్సిస్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. కార్తికేయ-శోభు యార్లగడ్డ క్వాలిటీ చూపించారు. రైటర్ కమ్ డైరెక్టర్ శశాంక్ యేలేటి కొన్ని చోట్ల తన ప్రతిభను చూపించాడు. కానీ ప్రేక్షకులకు బాగా అలవాటైన కథను ఎంచుకోవడంతో ప్రెడిక్టబిలిటీ అన్నది ముందే పెద్ద సమస్యగా మారింది. దాన్ని అధిగమించే స్థాయిలో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేేయలేకపోయాడు. ప్రథమార్దం వరకు ఓకే అనిపించినా.. ద్వితీయార్ధంలో అతను నిరాశపరిచాడు.

చివరగా: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. కొంచెం ఫన్- ఎక్కువ ట్రబుల్

రేటింగ్- 2.25/5

Tags:    

Similar News