పెళ్లి కాకుండానే పిల్లల్ని కంటాను.. కట్టప్ప పెంపకంపై నెటిజనుల ప్రశ్నలు!
దివ్య సత్యరాజ్ తన ఇంటర్వ్యూలో వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇష్టమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.;
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్ (కట్టప్ప) కుమార్తె దివ్య సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి. డీఎంకే నాయకురాలు, న్యూట్రిషనిస్ట్‌గా కొనసాగుతున్న దివ్య వివాహం- పిల్లల్ని కనడంపై తనకున్న విభిన్నమైన అభిప్రాయాలను బాహాటంగా వెల్లడించారు. సంతానం కలగడానికి వివాహం అనేది తప్పనిసరి నిబంధన కాదని.. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనే ఆలోచనకు తాను పూర్తిగా సిద్ధమని ప్రకటించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా.. తండ్రిగా సత్యరాజ్ తన కుమార్తె వెంటే నిలిచారు. తాను `పెరియార్` సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని.. కులమతాలు - మూఢ ఆచారాలకు తాను వ్యతిరేకమని ఆయన పునరుద్ఘాటించారు. వివాహం అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అని.. ప్రస్తుత ఆధునిక వైద్య సౌకర్యాల వల్ల పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనే అవకాశం ఉందని సత్యరాజ్ గుర్తు చేశారు. తన కుమార్తె ప్రగతిశీల ఆలోచనలను తాను గౌరవిస్తున్నానని చెబుతూ పూర్తి మద్దతు ప్రకటించారు.
దివ్య సత్యరాజ్ తన ఇంటర్వ్యూలో వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇష్టమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సహజీవనం చేసేవారు ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని... వేర్వేరు ఇళ్లలో ఉంటూ కూడా బంధాన్ని కొనసాగించవచ్చని ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి. తన తండ్రి తనకు ఎప్పుడూ నిర్ణయాధికారాన్ని ఇచ్చారని.. తన సంతోషమే ఆయనకు ప్రాధాన్యమని దివ్య పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆధునిక భావాలు గల మహిళగా ప్రశంసిస్తుంటే.. మరికొందరు సత్యరాజ్ పెంపకంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థను, సంప్రదాయాలను ఇలాంటి వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జాతకాలు, దైవచింతన లేని పెంపకం వల్లే ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. సత్యరాజ్ మాత్రం వీటన్నిటినీ వ్యక్తిగత స్వేచ్ఛగా కొట్టిపారేస్తున్నారు.
కేవలం దివ్య సత్యరాజ్ మాత్రమే కాకుండా... గతంలో కూడా పలువురు నటీమణులు వివాహం కాకుండానే తల్లులవ్వడం లేదా ఆ నిర్ణయాన్ని సమర్థించడం చూసాం. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ వివాహం చేసుకోకుండానే ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. అలాగే నీనా గుప్తా గతంలోనే పెళ్లి కాకుండానే కుమార్తెకు జన్మనిచ్చి సామాజిక విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల పలువురు సెలబ్రిటీలు సరోగసీ లేదా దత్తత ద్వారా సింగిల్ పేరెంట్స్‌గా మారుతూ.. సంతానానికి వివాహమే ఏకైక మార్గం కాదని నిరూపిస్తున్నారు.