టాప్ స్టోరీ:ఎంత వివాదం అయితే అంత వైర‌ల్‌!

ఒక సినిమాని నిర్మించ‌డం ఒకెత్త‌యితే దాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్ల‌డం మ‌రో ఎత్తు. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ని గ్రాబ్ చేయ‌డం అనేది మేక‌ర్స్‌కి పెద్ద టాస్క్‌గా మారింది.;

Update: 2026-01-10 05:53 GMT

ఒక సినిమాని నిర్మించ‌డం ఒకెత్త‌యితే దాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్ల‌డం మ‌రో ఎత్తు. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ని గ్రాబ్ చేయ‌డం అనేది మేక‌ర్స్‌కి పెద్ద టాస్క్‌గా మారింది. దీంతో ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నాయి. పబ్లిసిటీ కోసం ఎంత వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాలో అంత వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నాయి. ఇక వ‌ర్మ లాంటి వాళ్ల‌యితే పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా ఫ్రీ ప‌బ్లిసిటీని త‌మ సినిమాకు రాబ‌ట్టుకోవ‌డానికి వివాదాల‌ని ఎంచుకుని దాంతో త‌మ‌ సినిమాకు కావాల్సినంత మైలేజీని, ప‌బ్లిసిటీని రాబ‌ట్టేసుకుంటున్నాడు.

ఇప్పుడు కొంత మంది ఇదే పంథాని అనుస‌రిస్తూ త‌మ సినిమాల ప‌బ్లిసిటీకి కోట్లు ఖ‌ర్చు చేయ‌కుండా కేవ‌లం వివాదాల‌తో ప‌బ్లిసిటీని రాబ‌ట్టుకుంటున్నారు. ఒక్క పోస్ట‌ర్ లేదా? టీజ‌ర్‌లోని స‌న్నివేశాల‌తో కాంట్ర‌వ‌ర్శీల‌కు తెర‌లేపుతున్నారు. దీంతో అది కాస్తా వివాదంగా మారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఎంత దాకా అంటే చివ‌రికి పోలిస్టేష‌న్‌లు, మ‌హిళా క‌మీష‌న్‌ల దాకా వెళుతోంది. దీంతో ఆయా సినిమాల‌కు కావాల్సినంత ప‌బ్లిసిటీ ఫ్రీగానే వ‌చ్చేస్తోంది. అంద‌రూ కాక‌పోయినా కొంత మంది అంటే వ‌ర్మ, సందీప్‌రెడ్డి వంగ లాంటి వాళ్లు త‌మ సినిమాలు నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేసుకుంటున్నారు.

`అర్జున్‌రెడ్డి` టీజ‌ర్‌తో నెట్టింట చ‌ర్చ‌కు తెర‌లేపిన సందీప్‌రెడ్డి వంగ దాన్ని త‌న సినిమాకు ఏ స్థాయిలో వాడుకున్నాడో అంద‌రికి తెలిసందే. ప‌లు టీవీల్లో దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. దీంతో సినిమాకు కావాల్సినంత ప‌బ్లిసిటీ ఫ్రీగానే వ‌చ్చేసింది. ఆ త‌రువాత `యానిమ‌ల్‌` విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. సినిమ‌కు ముందు, సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే ఈ మూవీపై ఫెమినిస్ట్‌లు సంచ‌ల‌న కామెంట్‌లు చేయ‌డం, సినిమాలో ర‌ణ్‌బీర్‌..హీరోయిన్ త్రిప్తి దిమ్రీని త‌న బూట్‌ని నాక‌మ‌ని చెప్ప‌డం..త‌ను ట్రై చేయ‌బోతే ర‌ణ్‌బీర్ కాలు తీసేయ‌డం..వంటి త‌ద‌త‌ర సీన్స్ ఫెమినిస్ట్‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించాయి.

దీంతో `యానిమ‌ల్‌` మూవీతో పాటు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. వాటిని సందీప్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎంత వివాదం అయితే అంత వైర‌ల్ అవుతుంద‌ని చాలా లైట్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిదే. ఇదే ఫార్ములాని ఉప‌యోగించి ఆదిత్య‌ధ‌ర్ చేసిన మూవీ `ధురంధ‌ర్‌`. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ఈ సినిమాపై కూడా ఇంత‌కు మించిన విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సినిమా పాక్‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని కొంత మంది, ప్రో ఇండియ‌న్ మూవీ అని కొంత మంది...ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ని టార్గెట్ చేసేలా సినిమా ఉంద‌ని, ఇది ప‌క్కా ప్రాప‌గాండ ఫిల్మ్ అని మ‌రి కొంత మంది విమ‌ర్శ‌లు గుప్పించారు.

అవి ఎంత ఎక్కువైతే సినిమాకు అంత ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని ఈ విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. ఫ‌లితం సినిమా దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. నెట్టింట పెద్ద చ‌ర్చ‌కు దారి తీసి వైర‌ల్ అయింది. దీంతో ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఈ సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృస్టిస్తూ భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఎంత వైర‌ల్ చేస్తే అంత పాపులర్ అవుతుంద‌ని స్ప‌ష్టం కావ‌డంతో సందీప్‌రెడ్డి వంగ‌, వ‌ర్మ‌, ఆదిత్య‌ధ‌ర్ లాంటి ద‌ర్శ‌కులు ఫిక్స్ అయిపోయారు.

రీసెంట్‌గా విడుద‌ల చేసిన `స్పిరిట్` ఫ‌స్ట్ లుక్‌పై కూడా నెట్టింట చ‌ర్చ జ‌ర‌గ‌డం తెలిసిందే. ఒళ్లంతా బ్యాండేజీల‌తో.. చేతిలో లిక్క‌ర్ బాటిల్‌ని ప‌ట్టుకుని సిగ‌రేట్ తో ప్ర‌భాస్ ఉండ‌గా..సిగ‌రేట్ వెలిగిస్తూ త్రిప్తి దిమ్రి క‌నిపించింది. దీనిపై నెట్టింట విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. బ్యాండేజ్‌, సిగ‌రేట్, మందు.. అమ్మాయి..ఇవే సందీప్ కామ‌న్ ఫ్యాక్ట‌ర్స్ అని అంతా కామెంట్‌లు చేశారు. దీనిపై పెద్ద‌గా స్పందించ‌ని సందీప్ రెడ్డి వంగ దాని వెన‌క పెద్ద స్టోరీ ఉంద‌ని, అది సినిమా చూస్తేనే తెలుస్తుంద‌న్నాడు. ఇదే పంథాని ఇప్పుడు లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ ఫాలో అవుతోంది. క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయుకుడిగి న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ` టాక్సిక్‌`. ఈ మూవీ టీజ‌ర్‌లో య‌ష్ ఎంట్రీకి సంబంధించిన సీన్‌ని మ‌రీ ఎరోటిక్ సీన్‌తో ముడిపెట్టి చూపించ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

లేడీ డైరెక్ట‌ర్ అయి ఉండి ఇలాంటి ఇంటిమేట్ సీన్‌ని చేయ‌డం ఏంట‌ని అంతా గీతూ మోహ‌న్‌దాస్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై లేడీ డైరెక్ట‌ర్ తాజాగా స్పందించింది. `మ‌హిళా ద‌ర్శ‌కురాలు ఇలాంటి స‌న్నివేశాలు తెర‌కెక్కించిందంటూ వ‌స్తోన్న విమర్శ‌లు చూసి నేను చిల్ అవుతున్నాను` అంటూ షాక్ ఇచ్చింది. అంటే ఎంత వైర‌ల్ అయితే అంత పాపుల‌ర్ అవుతుంద‌న్న‌ది త‌న మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. విమ‌ర్శ‌లు చూసి చిల్ అవుతున్నాన‌ని కూల్‌గా అంటున్నారంటే వివాదం అవుతుంది..దాంతో సినిమా వైర‌ల్ అవుతుంద‌ని ముందే ఊహించార‌న్న‌మాటే క‌దా?..డైరెక్ట‌ర్స్‌, యాక్ట‌ర్స్ సినిమా ఫ్రీ ప‌బ్లిసిటీ కోసం ఇలా కొత్త మార్గాన్ని ఎంచుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Tags:    

Similar News