డింపుల్ హయాతిపై కేస్ ఫైల్?

ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయతి గత కొంతకాలంగా వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-01 05:50 GMT

ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయతి గత కొంతకాలంగా వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తన అపార్ట్మెంట్ లోని పార్కింగ్ విషయంలో ఏకంగా డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి ఇబ్బందులు పడ్డ ఈమె.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమెపై కేసు కూడా ఫైల్ అయినట్లు సమాచారం.. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

తాజాగా అందుతున్న వివరాల మేరకు.. సినీనటి డింపుల్ హయతి అలాగే ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయినట్లు సమాచారం. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డింపుల్ హయతిపై కేసు నమోదు చేశారట. ముఖ్యంగా తనతో ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని, కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా మార్చి కొట్టేందుకు ప్రయత్నం చేశారని, చిత్రహింసలకు గురిచేసిన నేపథ్యంలో హయాతీతో పాటు ఆమె భర్తపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారట. అయితే దీనిపై నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

డింపుల్ హయతి విషయానికి వస్తే.. గల్ఫ్ అనే చిత్రం ద్వారా 2017లో తెలుగు సినీ రంగానికి పరిచయమైంది డింపుల్ హయాతి. 1988 ఆగస్టు 21న తెలంగాణ రాజధాని హైదరాబాదులో జన్మించిన ఈమె.. గల్ఫ్ సినిమాతో కెరీర్ ప్రారంభించి , 2019లో వచ్చిన యురేకా సినిమాలో కూడా నటించింది. సినిమాలలో హీరోయిన్ గానే కాకుండా వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో "జర్ర జర్ర" అనే స్పెషల్ సాంగులో కూడా నటించి ఆకట్టుకుంది. 2022 ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడీ సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే 2023లో వచ్చిన రామబాణం అనే సినిమాలో చివరిగా నటించింది డింపుల్ హయతి.

సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. అలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఈ ఏడాది జనవరిలో ఒక మేజర్ సర్జరీ కూడా చేయించుకున్నాను అంటూ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బరువు పెరిగి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలిపింది. అంతేకాదు సర్జరీ నుంచి బయటపడడానికి ఏకంగా నెల రోజులు బెడ్ రెస్ట్ కూడా తీసుకున్నాను అంటూ తెలిపింది డింపుల్ హయతి. ఇక బరువు తగ్గించుకోవడం కోసం వర్కౌట్ పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడం వల్లే భుజం నొప్పి, కాలినొప్పి ,నడుము నొప్పి తదితర సమస్యలను కూడా డింపుల్ ఎదుర్కొన్నారట.

అనారోగ్య బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈమె సినిమాలలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో డింపుల్ హయతిపై ఇలాంటి ఆరోపణలు వినిపించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉందని ముఖ్యంగా ఈ విషయాలపై డింపుల్ స్పందించాలని కూడా కోరుతున్నారు. మరి డింపుల్ పై వినిపిస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News