2027 సంక్రాంతి పోరు.. ఆ ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య మళ్ళీ బిగ్ ఫైట్?

వెంకటేష్ సినిమాతో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే, బాలయ్య సినిమాతో గోపిచంద్ మరో మాస్ బ్లాక్ బస్టర్ పై కన్నేశారు.;

Update: 2026-02-01 06:56 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండగ వచ్చిందంటే చాలు పెద్ద సినిమాల మధ్య ఫైట్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే థియేటర్ల దగ్గర సందడి నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. 2026 సంక్రాంతి ముగిసిందో లేదో, అప్పుడే వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి రేసుపై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఏ హీరో ఏ సినిమాతో వస్తున్నాడు? ఏ డైరెక్టర్ తో జోడీ కడుతున్నాడు? అనే విషయాలపై సోషల్ మీడియాలో రకరకాల లీకులు చక్కర్లు కొడుతున్నాయి.

సాధారణంగా సంక్రాంతి బరిలో ఒకరిద్దరు సీనియర్ హీరోలు ఉండటం మనకు ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను మెప్పించే కథలతో ఈ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతుంటారు. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతికి ఇద్దరు క్రేజీ హీరోలు తమ సినిమాలను దాదాపు ఫిక్స్ చేసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు విషయం ఏంటంటే 2027 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ మధ్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. వెంకటేష్ తన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది గత ఏడాది రిలీజ్ అయి హిట్ కొట్టిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు సీక్వెల్ కావచ్చని ఒక టాక్ నడుస్తోంది. అయితే ఇది సీక్వెల్ లా కాకుండా ఒక స్టాండలోన్ సినిమాగా వచ్చే ఛాన్స్ కూడా ఉందట. దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉన్నా, వెంకీ మాత్రం పండగ బరిలో ఉండటం పక్కా అనిపిస్తోంది.

మరోవైపు నటసింహం బాలకృష్ణ కూడా తన మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కలిసి పండగ రేసులో నిలవబోతున్నారట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' సంక్రాంతికి వచ్చి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే మేజిక్ రిపీట్ చేసేందుకు గోపిచంద్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు మొదలవ్వాల్సి ఉంది. బాలయ్య - గోపిచంద్ మలినేని కాంబో అంటేనే మాస్ ప్రేక్షకుల్లో ఉండే హైప్ వేరే రేంజ్ లో ఉంటుంది.

వెంకటేష్ సినిమాతో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే, బాలయ్య సినిమాతో గోపిచంద్ మరో మాస్ బ్లాక్ బస్టర్ పై కన్నేశారు. ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మరో పక్క ఊరమాస్ యాక్షన్.. ఇలా రెండు భిన్నమైన జోనర్లు ఒకేసారి తలపడితే బాక్సాఫీస్ దగ్గర సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. ఈ ఇద్దరు హీరోలకు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది కాబట్టి, థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

2027 సంక్రాంతి రేసు ఇప్పుడే మొదలైపోయింది. ఈ క్రేజీ అప్‌డేట్స్ విన్న ఫ్యాన్స్ అప్పుడే తమ హీరోల సినిమాలపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ వస్తే గానీ అసలు క్లారిటీ రాదు. అప్పటి వరకు ఈ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ 'విక్టరీ' వర్సెస్ 'నటసింహం' ఫైట్ లో విజేత ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News