డ్యాన్సర్లకు అండగా చరణ్.. తండ్రికి తగ్గ తనయుడే..
ప్రమాదాలు, గాయాలు, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆ కష్టాలను గుర్తించిన చరణ్ వారికి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని తీసుకుని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్, నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. తండ్రి చూపించిన మార్గంలో నడుస్తూ సమాజ సేవలో కూడా ముందుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న చరణ్.. మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకుని సినీ కార్మికుల హృదయాలు గెలుచుకున్నారు.
చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మందికి ప్రాణాధారం అందుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వైద్య ఖర్చులు, చదువుల కోసం ఫీజులు వంటి సహాయ కార్యక్రమాలకు కూడా చిరంజీవి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు. రోజుకు లక్షల్లో సహాయం చేస్తున్నారన్న సమాచారం అభిమానుల్లో గర్వాన్ని కలిగిస్తోంది. అదే బాటలో రామ్ చరణ్ కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఇటీవల టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు చెందిన సుమారు 500 మంది డ్యాన్సర్లు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు చరణ్ ముందుకు వచ్చారు. సినిమా షూటింగ్ ల్లో డ్యాన్సర్లు తీవ్ర శారీరక శ్రమ పడుతుంటారు. ప్రమాదాలు, గాయాలు, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆ కష్టాలను గుర్తించిన చరణ్ వారికి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
గతంలో తన పుట్టినరోజు సందర్భంగా డ్యాన్సర్లకు అండగా నిలుస్తానని ఇచ్చిన హామీని తాజాగా ఆయన నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ పథకంలో భాగంగా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ ను అందించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో వారందరికీ హెల్త్ కార్డుల పంపిణీ కూడా జరగనుందని తెలిసింది.
ఆ కార్యక్రమాన్ని రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. సినీ కార్మికుల సంక్షేమంపై ఎప్పుడూ దృష్టి పెట్టే చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ కు తగ్గ వారసుడంటూ కొనియాడుతున్నారు.
సేవా కార్యక్రమాలతో హృదయాలను గెలుచుకుంటూనే సినిమాల పరంగా కూడా చరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనంతరం దర్శకుడు సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి స్టార్ డమ్ ఉన్నప్పటికీ కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిస్తూ ముందుకు సాగుతున్న రామ్ చరణ్.. నిజంగానే మెగాస్టార్ వారసత్వాన్ని నిలబెడుతున్నారని చెప్పాలి.