అలాంటి వేడుక‌ల‌కు పెద‌నాన్న‌ను పిల‌వాలంటే సిగ్గు వేసేది: వ‌రుణ్ తేజ్

యంగ్ హీరో వరుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `కొరియన్ కనకరాజు` బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశ‌గా ప్ర‌యాణిస్తోంది.

Update: 2026-08-15 03:34 GMT

యంగ్ హీరో వరుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `కొరియన్ కనకరాజు` బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశ‌గా ప్ర‌యాణిస్తోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. అన్ని కేంద్రాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సూపర్ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ వైజాగ్‌లో ఘనంగా `మెగా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్` నిర్వహించింది.

ఈ వేడుకలో కథానాయకుడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమా విజయంలో భాగస్వాములైన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు గాంధీతో ఉన్న స్నేహపూర్వక అనుబంధమే ఈ అవుట్‌పుట్‌కు కారణమని మళ్లీ ఆయనతో పని చేయాలని ఉందన్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం ప్రధాన బలమని కొనియాడారు. అలాగే రితిక, సునీల్, మురళీధర్ గౌడ్, రేవంత్ తదితరుల పాత్రలను ప్రశంసిస్తూ.. నటుడు సత్య అంకితభావం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చిరంజీవి గారి మాటలను గుర్తుచేశారు.

తన కుటుంబం అందించిన ప్రోత్సాహాన్ని వరుణ్ తేజ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. నటుడిగా తనను నిరంతరం ప్రోత్సహించే భార్య లావణ్యకు.. అలాగే తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. తన మెగా ఫ్యామిలీలోని పెదనాన్న, నాన్న, బాబాయ్ ఇచ్చిన మార్గదర్శకత్వమే క్రమశిక్షణతో పనిచేసేలా చేసిందని... నమ్మిన పనిని నిజాయితీగా చేయాలనే సూత్రాన్నే తాను పాటిస్తున్నానని చెప్పారు.

పెదనాన్న చిరంజీవే తనకు అతిపెద్ద ప్రేరణ అని వరుణ్ తేజ్ ఈ సంద‌ర్భంగా స‌క్సెస్ మీట్‌లో పేర్కొన్నారు. ఒక మంచి విజయం సాధించిన తర్వాతే ఆయనను వేడుకకు ఆహ్వానించాలని భావించానని... ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. స‌రైన విజ‌యం సాధించ‌ని సినిమాల‌కు పిలిచిన‌ప్పుడు కొంత సిగ్గుగా అనిపించేద‌ని కూడా వ‌రుణ్ గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులు, మెగా అభిమానులు చూపించిన అభిమానానికి రుణపడి ఉంటానని... మున్ముందు కూడా విభిన్నమైన పాత్రలతో అలరిస్తానని హామీ ఇచ్చారు. సరైన కథ కుదిరితే ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందనే సంకేతాన్ని ఇచ్చారు.

చివరగా వైజాగ్ నగరంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని వరుణ్ వ్యక్తం చేశారు. నటనలో మెళకువలు నేర్చుకోవడానికి న‌ట‌గురువు సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన నాటి రోజులను గుర్తుచేసుకుంటూ వైజాగ్ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ స‌క్సెస్ వేడుక‌కు తరలివచ్చిన ఉత్త‌రాంధ్ర‌ అభిమానులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

Tags:    

Similar News