'బిగ్ బాస్ 20' షోలో IPL బాస్ ల‌లిత్ మోదీ.. ఈ వార్త‌లు నిజ‌మేనా?

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ తో ప్రేమాయ‌ణం వార్త‌ల త‌రవాత మ‌ళ్లీ ల‌లిత్ మోదీ పేరు మార్మోగుతోంది.

Update: 2026-08-15 04:10 GMT

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ తో ప్రేమాయ‌ణం వార్త‌ల త‌రవాత మ‌ళ్లీ ల‌లిత్ మోదీ పేరు మార్మోగుతోంది. ఆయ‌న బిగ్ బాస్ హిందీ షోలో ఎంట్రీ ఇస్తున్నార‌నే ప్ర‌చారం వేడెక్కిస్తోంది. అయితే ఇది నిజ‌మేనా? అంటే... ఇదీ జ‌వాబు!

ఐపీఎల్ (IPL) వ్యవస్థాపకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త లలిత్ మోదీ తాను `బిగ్ బాస్ 20` రియాలిటీ షోలో పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. ఈ ప్రచారాన్ని పూర్తిగా అబద్ధమని తేల్చిచెప్పిన ఆయన సంబంధిత కథనాలను సోషల్ మీడియాలో కొట్టిపారేశారు. తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని... అసలు ఈ షోలో పాల్గొనే ఉద్దేశమే తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. కనీసం సంబంధిత వ్యక్తిని వివరణ కూడా అడగకుండా ఇలాంటి కల్పిత వార్తలను ఎలా ప్రచురిస్తారని ఆయన మీడియా తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు లలిత్ మోదీ తన న్యాయవాదులైన `హిరాణీ & అసోసియేట్స్` ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో ఆయన పేరు, ఫోటోలు, ఇమేజ్‌ను బిగ్ బాస్ షోతో జోడించి ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అలాగే లలిత్ మోదీ తరఫున మాట్లాడేందుకు కానీ.. ఈ షోతో ఒప్పందాలు చేసుకునేందుకు కానీ ఏ వ్యక్తికీ లేదా సంస్థకూ ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని ఆయన తరపున‌ లాయర్లు ఆ నోటీసులో పేర్కొన్నారు.

మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ఖాతాలు ఇప్పటికే ప్రచురించిన ఈ అబద్ధపు వార్తలను వెంటనే తొలగించాలనిలీగల్ నోటీసు ద్వారా హెచ్చరించారు. ఇకపై లలిత్ మోదీ అనుమతి లేకుండా ఇలాంటి కథనాలను ప్రచారం చేయకూడదని ఆదేశించారు. వార్తలను ప్రచురించే ముందు కనీసం నిజానిజాలు సరిచూసుకోవాలని.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్ సీజన్ 20` వచ్చే నెల నుండి జియోహాట్‌స్టార్ .. కలర్స్ టీవీలలో ప్రసారమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త సీజన్‌కు సంబంధించి నిర్వాహకులు టీజర్లను కూడా విడుదల చేశారు. పోటీదారుల అధికారిక జాబితా ఇంకా వెలువడక‌పోయినా ఈసారి నియా శర్మ, అర్జున్ బిజ్లానీ, కరణ్ పటేల్, జన్నత్ జుబేర్ వంటి పలువురు బుల్లితెర ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఈ లీగల్ నోటీసుతో లలిత్ మోదీ రాకపై వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడింది. బిగ్ బాస్ అభిమానులు వచ్చే నెల ప్రారంభం కానున్న ఈ షో కోసం కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... ఊహాగానాల ఆధారంగా వార్తలు రాసే డిజిటల్ మీడియా సంస్థలకు లలిత్ మోదీ తీసుకున్న ఈ చట్టపరమైన చర్య ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.

Tags:    

Similar News