దిల్ రాజు డ్రీమ్స్ ఫస్ట్ ప్రాజెక్ట్.. మరో నెల రోజుల్లో ఫిక్స్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను వెలికితేసే టార్గెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.;

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను వెలికితేసే టార్గెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త ప్లాట్ ఫామ్ స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించిన వెబ్ సైట్ ను హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విజయ్ దేవరకొండ, దేవిశ్రీ ప్రసాద్ తో లాంచ్ చేయించారు.
అయితే సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే యూత్ కు ఛాన్స్ ఇవ్వడంతోపాటు వారికి వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడం దిల్ రాజు డ్రీమ్స్ ముఖ్య ఉద్దేశ్యమని దిల్ రాజు తెలిపారు. తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ భారీ చిత్రాలకు, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త దర్శకులతో కూడిన సినిమాలకు పరిమితమైందని గుర్తు చేశారు.
అందుకే కొత్త టాలెంట్ కోసం పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక వేదిక అవసరమని భావించే దిల్ రాజు డ్రీమ్స్ ఆలోచన పుట్టిందని ఆయన తెలిపారు. చాలా మందికి సినిమాపై ప్యాషన్ ఉంటుంది కానీ, ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడతారని అన్నారు. అలాంటి వారందరికీ ఈ ప్లాట్ ఫామ్ ఒక సరైన మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు.
దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ పై సినిమా నిర్మాణంలో బలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న 14 మంది యువ నిపుణుల బృందం మద్దతు ఇస్తుందని చెప్పారు. అంకితమైన CEO కూడా ఉన్నారని ఆయన అన్నారు. స్క్రిప్ట్ ఎంపిక బహుళ దశల ద్వారా సాగుతుందని, క్యాస్టింగ్ కు ప్రతి దశలోనూ మార్గదర్శకత్వం చేస్తామని దిల్ రాజు వెల్లడించారు.
అదే సమయంలో దిల్ రాజు డ్రీమ్స్ అధికారిక కార్యకలాపాలు జూలై 1న ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. మొదటి ప్రాజెక్ట్ జూలై చివరి నాటికి ఫిక్స్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా వచ్చే అప్లికేషన్లను ఒక ప్రత్యేక బృందం పరిశీలించిన తర్వాతే తమ వద్దకు వస్తాయని దిల్ రాజు ప్రాసెస్ చెప్పారు.
అందుకే ప్రతిభ ఉన్నవారిని తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని దిల్ రాజు భరోసా ఇచ్చారు. రిజెక్ట్ అయిన వారు నిరాశ పడకుండా.. వారు తమలోని టాలెంట్ కు మరింత పదును పెట్టుకోవాలని సూచనలు ఇచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ తెలుగు సినిమాలోని తదుపరి తరం నటులు, సాంకేతిక నిపుణులకు లాంచ్ ప్యాడ్ గా మారుతుందని హామీ ఇచ్చారు. మరి ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో.. ఎవరెవరు సెలెక్ట్ అవుతారో వేచి చూడాలి.