'వేదం' పూజ ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్‌..!

ఇండస్ట్రీకి దూరం అయ్యి చాలా కాలం అయినా అప్పుడప్పుడు ఈమె ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించిన ప్రతిసారి ఈమె గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది.;

Update: 2026-02-24 07:09 GMT

అల్లు అర్జున్‌, క్రిష్‌ కాంబోలో వచ్చిన 'వేదం' సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దీక్షా సేథ్‌ పరిచయం అయిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా దీక్షాకి టాలీవుడ్‌లో మంచి లైఫ్ ఉంటుందని అంతా అనుకున్నారు. వేదం సినిమాలో పూజ పాత్రలో కనిపించిన దీక్షా సేథ్‌ మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. పైగా వేదం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమా ఆఫర్లు వచ్చాయి. 2010లో 'వేదం' సినిమాతో వచ్చిన దీక్షా సేత్‌ 2011లో మిరపకాయ్‌, వాంటెడ్‌ సినిమాలతో వచ్చింది. అదే ఏడాది ఒక తమిళ సినిమాలోనూ విక్రమ్‌కి జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సమయంలో ఆమె జోరు చూస్తే దీక్షా టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారడం ఖాయం అనుకున్నారు. కానీ ఆమెకి లక్ కలిసి రాలేదు. చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చాయి.

వేదం హీరోయిన్‌ దీక్షా సేథ్‌...

తెలుగులో దీక్షా సేథ్‌ నటించిన సినిమాల్లో వేదం, మిరపకాయ్ సినిమాలు మినహా మరే సినిమాలు హిట్‌ కాలేదు. పైగా ఇతర భాషల్లో నటించిన సినిమాలు కూడా ఈమెకి బ్రేక్‌ తెచ్చి పెట్టలేదు. అందంతో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలని ఈ అమ్మడి విషయంలో చాలా మంది ఒప్పుకుంటారు. నటనతో మెప్పించలేక పోయిన అందంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ దీక్షా సేత్‌ అందం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొన్నాళ్లకే దూరం కావాల్సి వచ్చింది. తెలుగులో ఈమె చివరిగా ప్రభాస్ రెబల్‌ సినిమాలో కనిపించింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌ కావడంతో మరో తెలుగు సినిమా ఆఫర్‌ ఈమె తలుపు తట్టలేదు. ఒకటి రెండు చిన్నా చితక సినిమా ఆఫర్లు వచ్చినా దీక్షా సేథ్ వాటిని సున్నితంగా తిరస్కరించిందని, పెద్ద ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

రవితేజ మిరపకాయ్‌ సినిమాలో హీరోయిన్‌గా...

ఇండస్ట్రీకి దూరం అయ్యి చాలా కాలం అయినా అప్పుడప్పుడు ఈమె ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించిన ప్రతిసారి ఈమె గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది. వేదం సినిమాలో భలే నటించింది, మిరపకాయ్ లో భలే అందంగా ఉంటుంది... ఇలా దీక్షా గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరగడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈసారి ఈమె ఒక యూకే బేస్డ్‌ గేమింగ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా నియమితం కావడం గురించి చర్చ జరుగుతోంది. బిజినెస్ మేనేజ్‌మెంట్‌ లో పట్టా పొందిన ఈమెకు ఆ ప్రముఖ గేమింగ్‌ కంపెనీ ఈ ఆఫర్‌ ను ఇచ్చిందని సమాచారం అందుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దీక్షా సేథ్‌ కి లక్‌ కలిసి రాకపోవడంతో ఆఫర్లు రాలేదు. దాంతో మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరం అయ్యి, ఇలా వ్యాపారం పై దృష్టి పెట్టింది.

తండ్రి ఉద్యోగరీత్యా దీక్షా సేథ్‌ దేశంలోని చాలా ముఖ్య పట్టణాల్లో జీవనం సాగించింది. చెన్నై, ముంబై, కోల్‌కత్తా, రాజస్థాన్‌, గాంధీ నగర్ ఇలా చాలా చోట్ల దీక్షా విద్యాభ్యాసం సాగింది. ముంబైలో కాలేజ్ చేసే రోజుల్లో సముద్రపు పురావస్తు శాస్త్రం పై ఆసక్తితో అది చదవాలని నిర్ణయించుకుంది. సముద్రపు అడుగు భాగంలో ఏం ఉంటాయి అనేది తెలుసుకోవాలి అనేది ఆమెకు ఆసక్తి. కానీ అనూహ్యంగా ఒక ఫ్యాషన్‌ షో లో పాల్గొనడం వల్ల టాప్‌ 10 లో నిలిచింది. అక్కడ నుంచి ఫ్యాషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం, మోడలింగ్‌ చేయడం, యాడ్స్ లో నటించడం వల్ల దర్శకుడు క్రిష్ దృష్టిలో పడి వేదం సినిమాలో అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్‌ సినిమాల్లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలను సైతం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు కెరీర్‌ లో కొత్త జర్నీ మొదలు పెట్టింది.

సినిమా కెరీర్‌కు విరామం ఇచ్చిన తర్వాత Deeksha Seth స్పెయిన్‌లోని IESE Business School నుంచి MBA పూర్తి చేశారు. ప్రస్తుతం యూకేకు చెందిన ఒక గేమింగ్ కంపెనీలో Director – Business Development & Strategic Partnerships గా పనిచేస్తున్నారు.లింక్డ్‌ఇన్‌లో దీక్షా ఈ మార్పును deliberate shiftగా వివరించారు. దశాబ్దకాలంగా మీడియా, ఆడియన్స్, బ్రాండ్స్‌తో పని చేసిన అనుభవాన్ని ఇప్పుడు బిజినెస్‌లో ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ కొత్త దారిని ఎంచుకున్నట్లు తెలిపారు.ఇక్కడ అయినా ఆమె జర్నీ సాఫీగా సాగాలని ఆమెను అభిమానించే వారు కోరుకుంటూ సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News