ప్రపంచీకరణ వేళ మారుతున్న సినీ అభిరుచులు!
నేటి డిజిటల్ తరానికి వినోదం అంటే ? కేవలం థియేటర్లో రిలీజయ్యే కమర్షియల్ సినిమాలు కాదు. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచం మొత్తం వారి వేలికొనలకు పరిమితమైంది.
నేటి డిజిటల్ తరానికి వినోదం అంటే ? కేవలం థియేటర్లో రిలీజయ్యే కమర్షియల్ సినిమాలు కాదు. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచం మొత్తం వారి వేలికొనలకు పరిమితమైంది. దీంతో ప్రేక్షకుల అభిరుచులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా అనుసరిస్తున్న కథా కథన పద్ధతులు నేటి యువతను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఒకప్పుడు స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకుడు ఇప్పుడు కంటెంట్ కోసం గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు చూస్తున్నాడు. ఈ క్రమంలో భారతీయ సినిమా పాత పద్ధతులతో కొనసాగిస్తే ఉనికిని కాపాడుకోవడం కష్టమనిపిస్తోంది.
జపనీస్ యానిమేషన్ వంటి ప్రక్రియలు ఇప్పుడు భారత యువతను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మారుమూల గ్రామం నుండి నగరాల వరకు ఎక్కడ చూసినా? ఇంటర్నెట్ ద్వారా విదేశీ కంటెంట్ చూసేవారి సంఖ్య పెరిగింది. వీటికి మన సినిమాలతో పోలిస్తే బడ్జెట్ తక్కువ కావొచ్చు. కానీ కథలో ఉండే గాఢత, ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మన సినిమాల్లో తరచుగా కనిపించే ఫార్ములాలు, లాజిక్ లేని ఫైట్లు , రెగ్యులర్ లవ్ స్టోరీలు యువతకు బోర్ కొడుతున్నాయి. వైవిధ్యం లేని కంటెంట్ స్థానంలో గ్లోబల్ సిరీస్‌లు ఆక్రమించడం సహజమే.
ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. కథల ఎంపికలో, స్క్రీన్‌ప్లే నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు రావాలి. మన దర్శకులు సంప్రదాయబద్ధమైన మూస ధోరణి నుండి బయటకు వచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కథలను సిద్ధం చేయాలి. ఒక ప్రాంతీయ కథను గ్లోబల్ ఎమోషన్స్‌తో జోడించి చెప్పగలిగితేనే ప్రేక్షకులు మళ్లీ మన సినిమాల వైపు వస్తారు. క్రియేటివిటీ విషయంలో రాజీ పడితే గ్లోబల్ కంటెంట్‌తో ఉన్న ఈ గ్యాప్ మరింత పెరిగిపోతుంది.
సాంస్కృతిక మార్పిడి అనేది మంచిదే. కానీ మన మూలాలను మర్చిపోయి ఇతర దేశాల కంటెంట్‌ను గుడ్డిగా ఫాలో అవ్వడం సరికాదు. ప్రపంచీకరణ పేరిట అన్ని సంస్కృతులు ఒకేలా తయారవుతున్నాయి. ఇలాంటి సమయంలో మన స్థానికతను, మన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా సినిమాలు తీయాలి. కథాంశం ఏదైనా? అది మానవతా విలువలకు , సహజమైన భావోద్వేగాలకు అద్దం పట్టాలి. అప్పుడే మన సినిమాలు ప్రపంచ వేదికపై నిలబడతాయి.
ప్రస్తుతం మేకర్స్ బడ్జెట్ మీద పెడుతున్న శ్రద్ధను కంటెంట్ మీద పెట్టడం లేదు. వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టినా? అందులో ఆత్మ లేకపోతే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. యువత కోరుకుంటున్న కొత్తదనాన్ని, నాణ్యతను అందించడంలో వెనకడుగు వేయకూడదు. కంటెంట్ ఈజ్ కింగ్ అనే నానుడిని నిజం చేయాలి. లేదంటే? రాబోయే కాలంలో స్థానిక సినిమాల ఆదరణ కేవలం చిన్న వర్గానికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం లేకపోలేదు.
గ్లోబల్ కంటెంట్‌తో పోటీ పడాలంటే ఇండియన్ మేకర్స్ తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకుండా? వారి మేధస్సుకు తగ్గ కంటెంట్ ఇవ్వాలి. కథల్లో సహజత్వం, పాత్రల్లో నమ్మశక్యమైనతనం ఉన్నప్పుడు తప్పకుండా ప్రేక్షకులు ఎలాంటి సినిమాలైనా? ఆదరిస్తారు. మన సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయి ప్రమాణాలను చేరుకోవడమే ముందున్న ఏకైక మార్గం.