విశ్వక్ స్పీడులో 'కల్ట్'.. ఈసారి క్లిక్కయ్యేనా?
దర్శకుడిగా విశ్వక్ గత రెండు సినిమాలు కూడా ఒకే తరహాలో లేవు. ‘ఫలక్‌నుమా దాస్’లో హైదరాబాద్ లోకల్ సెటప్ తీసుకుంటే, ‘దాస్ కా ధమ్కీ’లో డబుల్ రోల్‌తో థ్రిల్లర్ కథ చేశాడు.
విశ్వక్ సేన్ కథల సెలక్షన్ లో ఒక విషయం మాత్రం మారలేదు. హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా కొత్తగా ఏదో చేయాలనే ప్రయత్నం ఆపడు. ఇప్పుడు ‘కల్ట్’తో మళ్లీ అదే రూట్‌లో వెళ్తున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం కూడా చేస్తున్నాడు. అక్టోబర్ 30న విడుదల చేయాలని టీమ్ ఫిక్స్ చేసింది. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ తర్వాత విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న మూడో సినిమా ఇది.
విశ్వక్‌కు ఒక మంచి హిట్ కూడా ఇప్పుడు అవసరమే. 2024లో వచ్చిన ‘గామి’ మంచి ఫలితం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.21 కోట్ల గ్రాస్ కూడా సాధించింది. అప్పుడు విశ్వక్‌కు మంచి ఊపు వచ్చింది. అదే ఏడాది వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదు. తర్వాత ‘మెకానిక్ రాకీ’, 2025లో ‘లైలా’, ఈ ఏడాది ‘ఫంకీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలిసి రాలేదు. అయినా ఆ ఫలితాల తర్వాత సేఫ్ కథ కోసం వెళ్లకుండా ‘కల్ట్’లాంటి కొత్త జానర్‌ను ఎంచుకున్నాడు.
‘కల్ట్’ను ఇండియాలో తొలి మెయిన్‌స్ట్రీమ్ స్లాషర్ సినిమాగా టీమ్ ప్రచారం చేస్తోంది. పార్టీకి వెళ్లిన కొంతమంది యువకులు అక్కడి నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నం చుట్టూ కథ ఉంటుంది. టీజర్‌లో హింస, గేమ్స్, సర్వైవల్ అంశాలను ఎక్కువగా చూపించారు. విశ్వక్ ‘గేమ్ మాస్టర్’గా కనిపిస్తున్నాడు. రెగ్యులర్ యాక్షన్ సినిమా కాకుండా హాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే స్లాషర్ జానర్‌ను తెలుగులో ప్రయత్నించడం ఈ సినిమాకు కొత్త టచ్.
దర్శకుడిగా విశ్వక్ గత రెండు సినిమాలు కూడా ఒకే తరహాలో లేవు. ‘ఫలక్‌నుమా దాస్’లో హైదరాబాద్ లోకల్ సెటప్ తీసుకుంటే, ‘దాస్ కా ధమ్కీ’లో డబుల్ రోల్‌తో థ్రిల్లర్ కథ చేశాడు. ‘కల్ట్’ దగ్గర ఇంకా వేరే ప్రపంచాన్ని ఎంచుకున్నాడు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ పెట్టకుండా చాలామంది కొత్తవాళ్లను తీసుకున్నారు. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మొత్తం వంద మందికి దగ్గరగా నటీనటులు ఉంటారని టీమ్ ముందే చెప్పింది. కథలో పార్టీకి వచ్చిన గ్రూప్ ఎంత ముఖ్యమో టీజర్‌లోనే కనిపించింది. అందుకే విశ్వక్ పాత్ర ఒక్కటే కాకుండా మిగతా క్యారెక్టర్స్ కూడా సినిమాను మోయాల్సి ఉంటుంది.
‘కల్ట్’ తర్వాత కూడా విశ్వక్‌కు గ్యాప్ లేదు. నవంబర్ లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ వస్తోంది. డిసెంబర్ లో ‘లెగసీ’ విడుదలకు ఉంది. అంటే మూడు నెలల్లో వరుసగా మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అందులో ముందుగా వస్తున్న ‘కల్ట్’కు ఇప్పుడు ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ తో బజ్ పెంచాలి. ఇక కొత్త జానర్‌ను ప్రేక్షకుల దగ్గరకు ఎంత ఈజీగా తీసుకు వెళతారో చూడాలి.