ప్రపంచంలోనే అత్యంత అన్-లక్కీ లిరిసిస్ట్ ఈమె
హాలీవుడ్ సంగీత ప్రపంచంలో డయానే వారెన్ పేరు తెలియని వారుండరు. కానీ ఆస్కార్ వేదికపై ఆమె పేరు ఒక విషాదకరమైన రికార్డుతో ముడిపడి ఉంది.;
ఒకసారి.. రెండుసార్లు కాదు.. ఏకంగా 17 సార్లు ఫలహారంతో ప్లేట్ నోటి దాకా వచ్చినా దానిని ఎవరో లాగేసుకుంటే అది భరించడం ఎంత కష్టం! పాపం నోటికి అందాల్సినది ఎవరో కొట్టేసినట్టు...ఈమె అవార్డును ఇంకెవరో ఎగరేసుకుపోవడం నిజంగా షాకిచ్చేదే మరి.. ప్లేటు లాగేసుకున్నా ఫర్వాలేదు మళ్లీ మళ్లీ ఛాన్సుంటుంది.. కానీ ఇక్కడ ఏకంగా ఆస్కార్ నే లాగేసుకుంటున్నారు!
హాలీవుడ్ సంగీత ప్రపంచంలో డయానే వారెన్ పేరు తెలియని వారుండరు. కానీ ఆస్కార్ వేదికపై ఆమె పేరు ఒక విషాదకరమైన రికార్డుతో ముడిపడి ఉంది. 2026 ఆస్కార్ అవార్డుల్లో `కెపాప్ డెమొన్ హంటర్స్` చిత్రంలోని `గోల్డెన్` పాట అవార్డు గెలుచుకోగా.. డయానే వారెన్ రాసిన `డియర్ మీ` పాట మరోసారి ఓటమిని చవిచూసింది. దీంతో ఆస్కార్ చరిత్రలో అత్యధిక సార్లు నామినేట్ అయి.. ఒక్కసారి కూడా పోటీలో అవార్డు గెలవని వ్యక్తిగా ఆమె 17వ సారి తన అన్-లక్కీ రికార్డును కొనసాగించారు.
నిజానికి డయానే వారెన్ ఎన్నో అద్భుతమైన హిట్ పాటలను అందించారు. తన ప్రతిభను గుర్తించి అకాడమీ గతంలో ఒక గౌరవ ఆస్కార్‌ను అందించినా కానీ.. నేరుగా పోటీ పడి గెలిచే `బెస్ట్ ఒరిజినల్ సాంగ్` కేటగిరీలో మాత్రం ఆమెకు నిరాశే ఎదురవుతోంది. 17 సార్లు నామినేషన్ పొందినా ఆ ప్రతిమ ఆమెకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడి సోదరిలా డయానే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
సంగీత రంగంలో డయానే సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. ఎందరో అగ్రశ్రేణి గాయనీగాయకులకు ఆమె ప్రాణం పోసే సాహిత్యాన్ని అందించారు. కానీ ఆస్కార్ రేసులో మాత్రం ప్రతిసారీ ఎవరో ఒకరు తనను వెనక్కి నెట్టి అవార్డును తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అన్-లక్కీ లిరిసిస్ట్‌గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. పోటీలో గెలిచి ఆస్కార్ ప్రతిమను అందుకోవాలన్న ఆమె కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
ఆస్కార్ బరిలో టాలీవుడ్ లిరిసిస్ట్స్.. ప్రతిభ ఉన్నా కానీ..!
భారతీయ సినిమా గర్వించదగ్గ రీతిలో `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలోని `నాటు నాటు` పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ పాట ద్వారా తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ ప్రతిమను ముద్దాడి ఆయన పొందిన ఆనందం కోట్లాది మంది తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. కానీ డయానే వారెన్ వంటి 17 సార్లు ఓడిపోయిన రచయితల కథలను చూస్తుంటే ఆస్కార్ రేసు ఎంత కఠినమో అర్థమవుతుంది.
టాలీవుడ్ నుంచి మరో గేయ రచయిత ఆస్కార్ బరిలో నిలవాలంటే అవకాశం ఉందా అంటే.. కచ్చితంగా ఉందని చెప్పవచ్చు. మన దగ్గర గొప్ప సాహిత్యం అందించగల ప్రతిభావంతులు, హృదయాన్ని కదిలించే పాటలు రాసే దిగ్గజాలు ఉన్నారు. అయితే కేవలం గొప్ప పాట ఉంటే సరిపోదు. అది ఆస్కార్ ఓటర్ల దృష్టిలో పడాలి. అక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. హాలీవుడ్ మీడియాను ఆకర్షించి.. ఓటర్లను మెప్పించేలా ప్రమోషన్లు నిర్వహించడం అనేది అత్యంత వ్యయంతో కూడుకున్న పని.
ఆస్కార్ బరిలో నిలవాలంటే లక్షలాది డాలర్ల ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ టాక్. గతంలో `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలోని `నాటు నాటు` పాటను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి రాజమౌళి బృందం భారీగా ఖర్చు చేసిందని కథనాలు వచ్చాయి. హాలీవుడ్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడం.. స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయడం వంటి వాటికి భారీ బడ్జెట్ అవసరం. సామాన్య లిరిసిస్టులు లేదా చిన్న చిత్రాల నిర్మాతలు అంతటి భారాన్ని మోయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
ప్రతిభకు కొదవ లేకపోయినా.. ఆర్థిక బలం.. బలమైన ప్రమోషన్ నెట్‌వర్క్ ఉంటేనే ఆస్కార్ వేదికపై తెలుగు సాహిత్యం మరోసారి మెరిసే అవకాశం ఉంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలు.. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న దర్శకులు అండగా నిలిస్తేనే మన లిరిసిస్టులు లేదా సంగీతజ్ఞులకు ఆస్కార్ కల నిజమవుతుంది. కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా.. అదృష్టం, భారీ పెట్టుబడి తోడైతేనే ఆస్కార్ వేదికపై ఎవరైనా నిలబడగలరు.