డిస్ట్రిబ్యూటర్ల లాభాలు.. ధీరజ్ ఓపెన్ సీక్రెట్..
| సినిమా డిస్ట్రిబ్యూషన్లో భారీ పెట్టుబడులు పెట్టినా లాభాలు పరిమితంగానే ఉంటున్నాయని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. 2024లో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని కృష్ణా (వెస్ట్)లో డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, అన్ని ఖర్చులు పోను సినిమా రన్ పూర్తయ్యేసరికి సుమారు రూ.20 లక్షలే మిగిలాయని వెల్లడించారు. 2026లో సూపర్ హిట్ సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లకు దక్కే కమిషన్ దాదాపు 10 శాతమేనని పేర్కొన్నారు.
కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్.. నెలల తరబడి ఎదురుచూపులు.. సినిమా హిట్ అయితేనే ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఒకవేళ విజయం సాధించినా చేతికి వచ్చేది మాత్రం తక్కువ లాభమే! సినిమా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ బయటకు కనిపించినంత ప్రాఫిట్స్ తో లేదని టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల గురించి చర్చ జరుగుతుంది. సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎంత లాభం తెచ్చిపెట్టిందనే లెక్కలు బయటకు వస్తుంటాయి. కానీ ఆ వసూళ్ల వెనుక డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే రిస్క్ గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు. మూవీ రైట్స్ కోసం భారీ మొత్తాలు చెల్లించి, విడుదల తర్వాత వసూళ్ల కోసం ఎదురుచూడటం వారి బిజినెస్ లో పార్ట్.
అయితే సినిమా బాగా ఆడినా ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదన్నది ధీరజ్ మాటల్లో అర్థమవుతోంది. 2024 సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం', 'హనుమాన్' సినిమాలను కృష్ణా (వెస్ట్)లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఎక్స్ప్రీయిన్స్ ను ఆయన గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా 'గుంటూరు కారం' విషయంలో అన్ని ఖర్చులు పోను సినిమా మొత్తం రన్ పూర్తయ్యేసరికి సుమారు రూ.20 లక్షలు మాత్రమే మిగిలాయని వెల్లడించారు.
కోట్ల రూపాయలతో పోలిస్తే ఆ మొత్తం చాలా తక్కువనే చెప్పాలి. పెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నంత మాత్రాన భారీ లాభాలు వస్తాయనే గ్యారంటీ లేదని ఆ ఎగ్జాంపుల్ చెబుతోంది. అయితే సినిమా సూపర్ హిట్ అయినంత మాత్రాన డిస్ట్రిబ్యూటర్లకు భారీగా డబ్బులు మిగిలిపోతాయని అనుకోవడానికి వీల్లేదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఒక ఏరియా హక్కులను సొంతం చేసుకోవడానికి భారీ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. ఆ పెట్టుబడి తిరిగి రావాలంటే సినిమా మంచి వసూళ్లు సాధించాలి.
అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. ఇక పెట్టుబడికి మించి వచ్చే లాభం కూడా పరిమితంగానే ఉంటోంది. 2026లో మార్కెట్ పరిస్థితులు మరింత మారాయని ధీరజ్ వివరించారు. ఒక సినిమా సూపర్ హిట్ అయినా డిస్ట్రిబ్యూటర్లకు దక్కే కమిషన్ సుమారు 10 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అంటే సినిమా విజయం సాధించిందని డిస్ట్రిబ్యూటర్ భారీగా సంపాదించేస్తాడని చెప్పలేం. పెట్టుబడి, వసూళ్లు, ఖర్చులు, లాభం.. ఇలా ప్రతి విషయంలో కూడా లెక్కలు ఉంటాయి.
నిజానికి సినిమా బిజినెస్ లో నిర్మాతల ఇన్వెస్ట్మెంట్, హీరోల రెమ్యూనరేషన్లు, ఓటీటీ రైట్స్, థియేటర్ వసూళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు మాత్రం అంతగా బయటకు రావు. ఒక సినిమా ఆడకపోతే నష్టాన్ని భరించాల్సింది కూడా ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లే. అదే సినిమా బాగా ఆడితే ముందుగా పెట్టిన భారీ మొత్తాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే సినిమా సక్సెస్ అయినా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే లాభం ఎంతనే ప్రశ్న వినిపిస్తోంది. కోట్ల రూపాయలతో సాగే ఆ బిజినెస్ లో చివరికి మిగిలేది మాత్రం తక్కువ మొత్తం కావడం గమనార్హం. అదే ఓపెన్ సీక్రెట్ అని టాక్ వినిపిస్తోంది.