సోష‌ల్ మీడియా నుంచి క‌రిష్మా క‌పూర్ తో ఛాన్స్ వ‌ర‌కూ!

ఇండ‌స్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ వెండితెరపై అవకాశాలు అందుకోవడం అంత చిన్న విషయం కాదు.

Update: 2026-06-09 03:00 GMT

ఇండ‌స్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ వెండితెరపై అవకాశాలు అందుకోవడం అంత చిన్న విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధర్నా దుర్గా. విలక్షణమైన కామెడీ రీల్స్, `మా, బెహన్` వంటి విభిన్న పాత్రల అనుకరణతో నెటిజన్లను ఎంతగానో అలరించిన ధ‌ర్నా తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటి మాధురి దీక్షిత్‌తో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ అద్భుతమైన అవకాశం వెనుక ఆమె జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదం దాగి ఉంది.

ఒక‌వైపు జీవితంలో అత్యంత సంతోషకరమైన వార్త.. మరోవైపు తట్టుకోలేని గుండెకోత ఒకేసారి ఎదురైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో? ధర్నా దుర్గా ఇటీవలే అనుభవించింది. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పే పెద్ద సినిమా అవకాశం వచ్చిన కొద్ది రోజుల ముందే తండ్రిని కోల్పోయింది. తండ్రి లేని లోటుతో మానసిక వేదన ఒకవైపు.. చేతికి వచ్చిన పెద్ద అవకాశం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ధ‌ర్నా తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురైంది. అయినా? తండ్రి ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని భావించి ధైర్యంగా ముందడుగు వేసింది.

ధర్నా దుర్గా సోషల్ మీడియా వేదికగా చేసే వీడియోలకు ఇండస్ట్రీలో విపరీతమైన ఆదరణ ఉంది. మధ్యతరగతి కుటుంబాలలోని తల్లులు, సోదరీమణుల ప్రవర్తనను, వారి రోజువారీ ముచ్చట్లను ఎంతో సహజంగా, వ్యంగ్యంగా అనుకరిస్తూ ఆమె చేసే కంటెంట్ బాలీవుడ్ స్టార్స్‌ను సైతం ఆకట్టుకుంది. త్రిప్తి దిమ్రి వంటి నేటి తరం స్టార్ హీరోయిన్ల నుండి కూడా ధర్నా కంటెంట్‌కు ప్రశంసలు ద‌క్కాయి. ఈ గుర్తింపే ధ‌ర్నాను ఇంటర్నెట్ స్క్రీన్ల నుండి బాలీవుడ్ బిగ్ స్క్రీన్ వరకు ప్రయాణించేలా చేసిందని చెప్పొచ్చు.

ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురి దీక్షిత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ధర్నా ఎంతో భావోద్వేగానికి లోనైంది. చిన్నప్పటి నుండి ఎవరినైతే టీవీల్లో చూస్తూ పెరిగిందో? ఇప్పుడు అదే నటి పక్కన నిలబడి నటించడం కలలా ఉందంటూ ధ‌ర్నా భావోద్వేగానికి గురైంది. సాధారణ కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్ దిగ్గజాలతో కలిసి పనిచేసే స్థాయికి ఎదగడం ఆమెలోని ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనం. ఈ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని ధ‌ర్నా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.

ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రతిభ ఉన్నవారికి ఎంతటి గొప్ప అవకాశాలను తెచ్చిపెడుతున్నాయో ఈ పరిణామంతో మ‌రోసారి రుజువైంది. గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు ఉంటేనే కాకుండా కంటెంట్‌లో దమ్ముంటే ఇండస్ట్రీ వెతుక్కుంటూ వస్తుందని ధర్నా నిరూపించింది. ఎన్నో అడ్డంకులు, వ్యక్తిగత నష్టాలను అధిగమించి ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయి నుండి బాలీవుడ్ నటిగా ఎదుగుతున్న ధర్నా దుర్గా ప్రయాణం పరిశ్రమలోకి రావాలనుకునే ఎంతోమంది యువ ప్రతిభావంతులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

Tags:    

Similar News