దుబాయ్ కాన్సర్ట్ అనుభవం నుండి రామాయణం వరకు!
సంగీతానికి భాషతో సంబంధం లేదని, సంగీతపరమైన ఆకట్టుకునే గుణం ఉన్నప్పుడు అది ఏ భాషలోని పాటైనా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుందని రెహమాన్ స్పష్టం చేశారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్లలో ఆలపించే పాటల ఎంపికపై వస్తున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష సంగీత ప్రదర్శనల్లో రెహమాన్ తమిళ పాటలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాలు.. నెటిజన్ల ఫిర్యాదులపై ఆయన స్పందించారు. సంగీతానికి భాషతో సంబంధం లేదని, సంగీతపరమైన ఆకట్టుకునే గుణం ఉన్నప్పుడు అది ఏ భాషలోని పాటైనా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుందని రెహమాన్ స్పష్టం చేశారు.
`ది వండర్మెంట్ టూర్` సందర్భంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాన్సర్ట్ సెట్‌లిస్ట్ రూపొం దించడంపై మనసు విప్పారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు చెందిన విభిన్న భాషల ప్రేక్షకులను ఒకే వేదిక వద్ద మెప్పించడం నిజంగా పెద్ద సవాలు అని పేర్కొన్నారు. స్వయంగా ఒక శ్రోతగా ఆలోచిస్తూ.. ఏ పాటలు వింటే తానైతే ఆనందిస్తానో వాటినే కాన్సర్ట్ సెట్లిస్ట్లో చేరుస్తుంటానని వివరించారు.
కాన్సర్ట్‌కు వచ్చే ప్రేక్షకులు భావోద్వేగాల కోసం వస్తారని, అక్కడ భాష కంటే సంగీతం ఇచ్చే అనుభూతికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని రెహమాన్ తెలిపారు. `తమిళనాడులో హిందీ పాటలు పాడినా లేదా ఉత్తరాదిన తమిళ పాటలు పాడినా కొందరు ఫిర్యాదులు చేస్తుంటారు. `రోజా` లేదా `బాంబే` సినిమాల పాటల్లో తమిళ వెర్షన్ బాగుంటుందని కొందరు, హిందీ వెర్షన్ బాగుంటుందని మరికొందరు అంటుంటారు. 50 వేల మంది జనం ముందు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి చిన్న చిన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోలేము` అని వ్యాఖ్యానించారు.
భాషా సరిహద్దులు దాటి ప్రేక్షకులు తన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పడానికి ఆయన ఓ పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన రెండో కాన్సర్ట్‌లో తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పటికీ `ముస్తఫా ముస్తఫా` పాట పాడుతుండగా ప్రేక్షకులు లైటర్లు వెలిగించి చూపించిన ఉత్సాహం తనకు ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండి పోయిందన్నారు. స్మార్ట్ఫోన్లు లేని ఆ రోజుల్లోనే సంగీతం ప్రజలను ఆ రకంగా ఏకం చేసిందని రెహమాన్ గుర్తు చేశారు.
ప్రస్తుత తరం శ్రోతలలో వచ్చిన మార్పును ప్రత్యేకంగా కొనియాడారు. ఇప్పుడు భాషా బేధాలు పూర్తిగా చెరిగిపోయాయని.. సింఫనీ కాన్సర్ట్లలో కేవలం పియానో, గాయకులు మాత్రమే ఉన్నప్పటికీ శ్రోతలు పరవశిం చిపోతున్నారని చెప్పారు. కొత్త తరం సంగీతాభిమానులు ప్రతి ఒక్క లిరిక్‌ను క్షుణ్ణంగా పాడగలుగుతున్నారని, ఇది భారతీయ సంగీతంలో వచ్చిన అతిపెద్ద మార్పుగా రెహమాన్ వర్ణించారు.
త్వరలోనే ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ లలో ప్రారంభం కానున్న ఇండియన్ టూర్ కాన్సర్ట్ ప్రదర్శనలలో 90ల నాటి క్లాసిక్స్ నుండి నేటి ట్రెండింగ్ హిట్స్ వరకు విభిన్న జానర్ల పాటలతో అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అలాగే హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్తో కలిసి `రామాయణం` చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు వెల్లడించారు. భాష ఏదైనా సంగీతంతో శ్రోతలను కట్టిపడేయడమే తన నైజమని ఆస్కార్ విజేత మరోసారి చాటి చెప్పారు.