శ్రీనిధి త‌క్కువ సినిమాలు చేయ‌డానికి అస‌లు కార‌ణం!

`కేజీఎఫ్` సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి తాజాగా పారితోషికంపై వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు.

Update: 2026-10-27 13:30 GMT

`కేజీఎఫ్` సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి తాజాగా పారితోషికంపై వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. `కేజీఎఫ్` సక్సెస్ తర్వాత ఒక్కో సినిమాకు ఏకంగా 7 నుంచి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు నడిచాయి. అయితే ఈ వార్తలన్నింటిలో ఎలాంటి నిజం లేదని.. ఇవన్నీ నిరాధారమైన వదంతులు మాత్రమేనని కుండ బద్దలు కొట్టారు.

డబ్బుల కోసమే సినిమాలు చేస్తాననే ప్రచారాన్ని ఖండించిన శ్రీనిధి కెరీర్ ప్రాధాన్యతలపై స్పష్టతనిచ్చారు. తనకు కేవలం డబ్బు సంపాదించడమే గమ్యంగా ఉంటే? గత కొన్ని సంవత్సరాలలో సులభంగా 30 నుంచి 40 సినిమాలు చేసేదాన్నని వెల్లడించారు. కానీ తాను డబ్బు కోసం కాకుండా కథలో బలమైన కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని స్పష్టం చేశారు. తక్కువ సినిమాలలోనే నటించడానికి గల అసలు కారణం ఇదేనని తెలిపారు.

తాను నటించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు అంత భారీ మొత్తంలో పారితోషికం ఎలా డిమాండ్ చేయగలనని ప్రశ్నించారు. ఈ రకమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తనపై వచ్చే రూమర్లను పట్టించుకోకుండా మంచి కథలతో కూడిన విభిన్న పాత్రలను ఎంచుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని శ్రీనిధి తేల్చిచెప్పారు.

`ఆదర్శ కుటుంబం` సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో తన పాత్రతో పాటు కథాంశం ప్రత్యేకంగా ఉంటుందన్నారు. కుటుంబ సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఉన్నా? ఇది ఇతర సినిమాలలా కాకుండా సరికొత్త డార్క్ కామెడీ శైలిలో సాగుతుందని.. కెరీర్‌లో తొలిసారిగా పూర్తిస్థాయి కామెడీ జానర్‌ను టచ్ చేస్తున్నా అన్నారు.

మొత్తానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నానంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన శ్రీనిధి శెట్టి కేవలం కంటెంట్ బేస్డ్ ప్రాజెక్టులకే కట్టుబడి ఉంటానని నిరూపించుకున్నారు. గ్లామర్ పాత్రలకంటే నటనకు ఆస్కారం ఉన్న వైవిధ్యమైన పాత్రలతోనే ప్రయాణం కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న టాలెంటెడ్ బ్యూటీ భ‌విష్య‌త్ లో మరిన్ని విజయాలను అందుకోవాల‌ని ఆశీద్దాం.

Tags:    

Similar News