2సార్లు చావు అంచుల వరకు వెళ్లిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. చివరకు?

ప్రకాశం జిల్లా.. బల్లికురవ మండలం.. కొమ్మినేని వారి పాలెంలో జన్మించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి చూపించారు;

Update: 2025-09-21 13:30 GMT

ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. లెజెండ్రీ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. మరణించి 13 ఏళ్లయినా ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు అనడంలో సందేహం లేదు. ప్రకాశం జిల్లా.. బల్లికురవ మండలం.. కొమ్మినేని వారి పాలెంలో జన్మించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి చూపించారు. అలా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలితో ఆయనకున్న అనుబంధం ఎంతో గొప్పది. ఆ బంధం థియేటర్ అనుభవమే కాకుండా సినిమాల్లోకి వచ్చేలా చేసిందని చెబుతూ ఉంటారు. సినిమాల్లోకి రాకముందు 200 వరకు వాణిజ్య ప్రకటనలు, వ్యవసాయ కార్యక్రమాలకు వాయిస్ ఇచ్చిన ఈయన.. ప్రముఖ టీవీ ఛానల్ లో 'డింగ్ డాంగ్' అనే రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ద్వారా తన వ్యంగ్య హాస్యాన్ని కూడా చూపించారు.

నాటకాల ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం తొలిసారి దిగ్గజ దర్శకులు జంధ్యాల దర్శకత్వంలో 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత నువ్వు నేను, ధైర్యం ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడుగానే కాకుండా రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటారు. 'తోక లేని పిట్ట' అనే సినిమాకి దర్శకత్వం వహించిన ఈయన.. మొదటి ప్రయత్నంలో విఫలం అవడంతో మళ్లీ ఆ దిశ వైపు అడుగులు వేయలేదు.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో చేరిన ఈయన.. రాష్ట్ర సాంస్కృతిక మండల చైర్మన్ గా నియమితులై కళాకారుల సంక్షేమం కోసం పలు సేవలు కూడా అందించారు. ఇలా ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఏకంగా రెండుసార్లు చావు చివరి అంచుల వరకు వెళ్లి.. చివరికి క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. మరి ఈ రెండు ప్రమాదకర సంఘటనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒకసారి నువ్వు నేను సినిమా సక్సెస్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. ధర్మవరపు ప్రయాణిస్తున్న కారు మీద బస్సు ఎక్కిందట. అలా తలకు 21 కుట్లు పడగా.. చేతికి ఆపరేషన్ చేసి రాడ్స్ కూడా వేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోసారి సౌందర్య, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన శ్వేత నాగు సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. బెంగళూరు దగ్గరలోని అడవిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా.. ఒక కీటకం కుట్టిందట. గదిలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించగా స్మోక్ కారణంగా ఈ సమస్య ముదిరిపోయిందని చెప్పారంట. దాంతో పది రోజులపాటు కోమలో ఉన్న ఈయన.. ఆ తర్వాత కోలుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక 2012లో ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యుల దగ్గరికి వెళ్ళగా.. అప్పటికే ఆయనకు క్యాన్సర్ వచ్చిందని , ఆయన నాలుగో స్టేజిలో లివర్ క్యాన్సర్ తో పోరాడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. నిర్ధారణ తర్వాత ఏడాది పాటు జీవించిన సుబ్రహ్మణ్యం.. ఇంటికే పరిమితమై ఆ తర్వాత 2013 డిసెంబర్ 7న లివర్ క్యాన్సర్ తో చనిపోయారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.

ఇకపోతే ఆయనకు తన మనవళ్లను చూడాలి అని, తన వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగించాలని చాలా కోరికగా ఉండేదట. అందుకే పెద్ద కొడుకు బిజినెస్ లో సెటిల్ అవడంతో చిన్న కొడుకు తేజ ఉద్యోగాన్ని చేసి వదిలేసి.. తండ్రి కోరికను నెరవేర్చడానికి ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆయనకు మంచి అవకాశాలు లభించకపోవడం బాధాకరం అనే చెప్పాలి. ఏది ఏమైనా చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. కోరికను దృష్టిలో పెట్టుకొని ఆయన వారసుడు తేజకి సినీ పెద్దలు అవకాశాలు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News