ధనుష్ రాజకీయ ఎంట్రీపై దర్శకుడు కామెంట్!
అంతేకాదు ఈ విజయం చూసి అప్పట్లో ఎన్టీఆర్ ని గుర్తు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అలా సినిమాలతో సత్తా చాటి ఇటు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు.
సినిమా రంగానికి,రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సెలబ్రిటీలు పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి ప్రజలకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గత 3,4 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ , కమల్ హాసన్ లాంటి సినీ సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో సత్తా చాటుతుంటే.. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే ఏకంగా తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అవతరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు ఈ విజయం చూసి అప్పట్లో ఎన్టీఆర్ ని గుర్తు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అలా సినిమాలతో సత్తా చాటి ఇటు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు.
ఇలాంటి కొంతమంది సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది సెలబ్రిటీలు రాజకీయ రంగం వైపు అడుగులు వేయడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే
ఈ క్రమంలోనే కోలీవుడ్ నాట నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా మరింత సక్సెస్ అందుకున్న ధనుష్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అంటూ ఒక వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వేళ.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశారు ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా.
ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న కస్తూరి రాజా తన కొడుకు, మనవళ్ళు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయనకు ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై ఒక ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన మాట్లాడుతూ.." ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వెళ్లే హక్కు ఉంటుంది. నా కొడుకు , మనవళ్ళు కూడా ఆ దారిలో వెళ్లొచ్చు" అంటూ తెలిపారు. సీఎం విజయ్ తరహా లోనే ధనుష్ కూడా అభిమాన సంఘాల ద్వారా కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి కస్తూరి రాజా చెప్పిన మేరకు ధనుష్ కూడా త్వరలో రాజకీయరంగ ప్రవేశం చేస్తారా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక దీనిపై పూర్తి నిజాలు తెలియాలి అంటే దీనిపై ధనుష్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.
ధనుష్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కుబేర, ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు ఇళయరాజా బయోపిక్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే ధనుష్ 56 సినిమాలో కూడా నటిస్తున్నారు ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏదేమైనా ధనుష్ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా భాషలలో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.