అడవిలో చెట్లు కొట్టుకునేవాడికి అంతర్జాతీయ గ్యాంగ్‌తో సంబంధం ఏంటి?
రొటీన్‌కు భిన్నంగా, సరికొత్త కథలతో ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమా అనుభూతిని పంచాలని తపించే అరుదైన నటులలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకరు.
రొటీన్‌కు భిన్నంగా, సరికొత్త కథలతో ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమా అనుభూతిని పంచాలని తపించే అరుదైన నటులలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకరు. మొదటి నుంచి అతడి స్క్రిప్ట్ ఎంపికలు ఇదే విషయాన్ని నిరూపించాయి. కల్ట్ క్లాసిక్ కథలపైనా, రియాలిటీ ఎలిమెంట్స్ పైనా ధనుష్ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. గతంలో ఈ కల్ట్ జానర్‌లో అతడు చేసిన కొన్ని ప్రయోగాలు ఆశించిన అంచనాలను అందుకోలేకపోయినా.. మరికొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అందుకే పరాజయాలకు భయపడకుండా.. కథలోని కొత్తదనం కోసం వెంపర్లాడే ధనుష్ తాజాగా మరోసారి ఒక పవర్‌ఫుల్ డార్క్ కల్ట్ జానర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
శివకార్తికేయన్ `అమరన్` చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి- ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు `ఓం-చాప్టర్ 1` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వండర్‌బార్ ఫిల్మ్స్ - ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది 1980 లేదా 1990ల నాటి పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా .. లవ్ స్టోరీగా రూపొందుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. మద్రాస్ (చెన్నై) బ్యాక్‌డ్రాప్‌తో ముడిపడి ఉంటూనే... ఒక అంతర్జాతీయ నేర సామ్రాజ్యానికి సంబంధించిన ఎలిమెంట్స్‌ను కూడా ఈ కథ టచ్ చేయనుందని సమాచారం.
తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. దట్టమైన అడవిలో, వర్షం కురిసే రాత్రి వేళ అక్రమంగా ఎర్రచందనం నరుకుతూ జీవించే అమాయక కార్మికులను కొందరు ఫారెస్ట్ గార్డ్స్ లేదా ఆర్మీ అధికారులు గన్ పాయింట్‌లో ఉంచి ఎన్‌కౌంటర్ చేయాలని చూస్తారు. వర్షం కురిసే ఆ సమయంలో వారిని కాపాడేందుకు చేతిలో గొడ్డలి పట్టుకుని `గొడ్డలి దేవుడు`లా ధనుష్ ఎంట్రీ ఇస్తారు. ఈ సినిమాలో ధనుష్ ఒక అడవిలో కట్టెలు కొట్టుకునే కార్మికుడి పాత్రలో రా అండ్ రస్టిక్ ఎనర్జీతో కనిపించబోతున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వింటేజ్ మాస్ ధనుష్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మళ్లీ స్క్రీన్‌పై చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో మరో అతిపెద్ద ఆకర్షణ.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం. ఇందులో ఆయన `కార్తికేయన్` అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడు కథను ఎంచుకున్నారంటేనే ఇందులో స్క్రీన్ ప్లే ట్విస్టులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ధనుష్, మమ్ముట్టిల కాంబినేషన్ స్క్రీన్‌పై మ్యాజిక్ సృష్టించబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండటం విశేషం. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా... ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 60 నుండి 65 శాతం వరకు పూర్తయింది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టైటిల్‌కు `చాప్టర్ 1` అనే ట్యాగ్‌లైన్ ఉంది గనుక పార్ట్ 2 ఉంటుందనుకోవాలి. మొదటి భాగం కథ దానికి అదే పరిపూర్ణంగా ముగుస్తుందని దర్శకుడు చెబుతుండటం ఆసక్తికరం. అన్యాయానికి గురవుతున్న తన వారి కోసం పోరాడే ఒక అడవి బిడ్డ కథ... అంతర్జాతీయ మాఫియాతో ఎలా ముడిపడింది? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న ఈ `ఓం` చిత్రం.. అణువణువునా మతిపోయే ట్విస్టులతో గనుక వర్కవుట్ అయితే.... ధనుష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.