కుబేర.. చెన్నైలో ఎంత చిత్రమంటే?
ఆల్రెడీ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమా చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్.;
ఆల్రెడీ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమా చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ఆ చిత్రం అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి విజయాన్నందుకుంది. తన చివరి చిత్రం ‘రాయన్’ తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇలాంటి టైంలో శేఖర్ కమ్ములతో జట్టు కట్టిన ధనుష్.. మరో పెద్ద హిట్ కొట్టబోతున్నాడని అంతా అనుకున్నారు. దాని ప్రోమోలు కూడా అంత ప్రామిసింగ్‌గా కనిపించాయి. తొలి రోజు ఈ చిత్రానికి చాలా మంచి టాక్ కూడా రావడంతో తెలుగులో వసూళ్లు అదిరిపోయాయి. వీకెండ్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించింది.
కానీ ధనుష్ సొంతగడ్డ అయిన తమిళనాడులో మాత్రం ‘కుబేర’ సత్తా చాటలేకపోయింది. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగానే ఉన్నపుడే అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే టాక్ బాగుంది కాబట్టి వసూళ్లు పుంజుకుంటాయని ఆశిస్తే అలాంటిదేమీ జరగలేదు. తొలి రోజు పరిస్థితి ఆశాజనకంగానే కనిపించింది కానీ.. తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ‘కుబేర’ తెలుగు వెర్షన్ రెండో వీకెండ్లో ‘కన్నప్ప’ నుంచి పోటీని తట్టుకుని బలంగా నిలబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. చెన్నైలో సైతం ఈ శని, ఆదివారాల్లో ‘కుబేర’ తెలుగు వెర్షన్‌కు మంచి వసూళ్లు వచ్చాయి.
నిన్న సాయంత్రం, నైట్ షోలకు చెన్నైలో ‘కుబేర’ పరిమిత షోలతోనే మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. మల్టీప్లెక్సుల్లో ఓవైపు ‘కుబేర’ తెలుగు వెర్షన్‌కు హౌస్ ఫుల్ పడితే.. పక్కనే ఉన్న స్క్రీన్లలో తమిళ వెర్షన్‌కు మాత్రం ఆక్యుపెన్సీలు మాత్రం 10-20 శాతం మధ్య ఉన్నాయి. ఒక తమిళ స్టార్ హీరో సినిమాకు చెన్నై లాంటి సిటీలో ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రం. ఎంత తెలుగు దర్శకుడు తీసిన సినిమా అయినా సరే.. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ఉంటుంది. ధనుష్‌ను ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లో చూడడానికి తమిళ ప్రేక్షకులు ఇష్టపడతారు. అయినా సరే.. ఆ సినిమాకు అక్కడ ఆదరణ దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘కుబేర’ అసలు తమిళులకు ఎందుకు నచ్చట్లేదన్నది ఒక మిస్టరీగా మారింది. ‘కుబేర’ మేకర్స్ కంటే కూడా ధనుష్‌కు ఇది పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.