ఆదిపురుష్ దర్శకుడితో ధనుష్ 'కలాం'

ఒక మంచి ప్రేరణనిచ్చే వ్యక్తిత్వాల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితంపై రూపొందే బయోపిక్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.;

Update: 2025-05-21 17:46 GMT

ఒక మంచి ప్రేరణనిచ్చే వ్యక్తిత్వాల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితంపై రూపొందే బయోపిక్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ పాత్రలో నటించబోతున్న వ్యక్తి ఎవరంటే.. నటనలో విలక్షణతకు పేరు గాంచిన ధనుష్. ‘కలాం’ అనే టైటిల్‌తో ధనుష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాను ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓం రౌత్ తెరకెక్కించబోతున్నారు. కలాం జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందబోయే ఈ చిత్రాన్ని టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ లాంటి ప్రముఖ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో ఈ మూవీ వస్తోంది. టైటిల్ పోస్టర్ గమనిస్తే కలాం గారి రూపాన్ని ప్రదర్శించే సిల్హౌట్ లోంచి ఒక మిస్సైల్ లాంచ్ అవుతుంది. ఇది కలాం జీవితం, ఆయుధ సాంకేతిక రంగంలో అందించిన సేవలకు ప్రతిరూపంగా కనిపిస్తోంది. కలాం పేరుని 'ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అనే ట్యాగ్ లైన్‌తో ప్రదర్శించడం ఈ చిత్రం పట్ల విశ్వసనీయతను పెంచింది. ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ధనుష్ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శారీరకంగా, మానసికంగా తాను సిద్దమవుతున్నట్లు సమాచారం. కలాం పాత్రలో జీవించేందుకు సుదీర్ఘ సమయం పాటు వేషధారణ, సంభాషణలపై పనిచేయనున్నారని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే ధనుష్ 'అసురన్', 'వెత్రిమారన్' వంటి చిత్రాల్లో బలమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కలాం పాత్రలో నటించడం మరో కెరీర్ డెఫినింగ్ పాత్రగా మారే అవకాశం ఉంది.

ఈ సినిమాలో మిగతా తారాగణం వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా, భారత సినిమా చరిత్రలో ప్రేరణాత్మకమైన బయోపిక్స్‌లో ఒకటిగా నిలిచేలా 'కలాం' చిత్రాన్ని మలచాలని చిత్ర బృందం ధ్యేయంగా పెట్టుకుంది. ధనుష్, ఓం రౌత్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ భారతీయులకు గర్వకారణంగా నిలవడం ఖాయం. ఇక సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో చూడాలి.

Tags:    

Similar News