ఇన్నేళ్ల తర్వాత దేవి రీటర్న్స్.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

27 ఏళ్ల కింద‌ట రిలీజైన దేవి సినిమా టాలీవుడ్ హిస్ట‌రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.;

Update: 2026-04-26 11:30 GMT

27 ఏళ్ల కింద‌ట రిలీజైన దేవి సినిమా టాలీవుడ్ హిస్ట‌రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నిర్మాత ఎంఎస్ రాజు విజన్, డైరెక్ట‌ర్ కోడి రామకృష్ణ టేకింగ్, అప్పటి టెక్నాలజీ పరిమితుల్లో రూపొందిన గ్రాఫిక్స్.. అన్నీ కలిసి ఆ సినిమాను ఒక సెన్సేషన్‌గా నిలిపాయి. ఇప్పుడు అదే సినిమాకు కొనసాగింపుగా దేవి2ను ప్లాన్ చేస్తున్నారనే వార్త బయటకు రావడంతో, సహజంగానే నాస్టాల్జియా వేవ్ మరోసారి టాలీవుడ్‌లో కనిపిస్తోంది.

1999లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి దేవిని చూసిన అనుభూతి పూర్తిగా భిన్నం. ఆ సమయంలో గ్రాఫిక్స్, పాము కాన్సెప్ట్, దేవతా శక్తుల ప్రదర్శన ఇవ‌న్నీ కొత్తగా అనిపించాయి. అదే కారణంగా దేవి సినిమా ట్రెండ్‌సెటర్‌గా నిలిచింది. ఇప్పుడు అయితే పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులు ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు, హై-ఎండ్ కంప్యూట‌ర్ గ్రాఫిక్స్.. అన్నీ కలిసి వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచేశాయి. కాబట్టి దేవి2 వస్తే అది కేవలం నాస్టాల్జియాతో సరిపోదు, అదే అనుభూతిని కొత్త స్థాయిలో అందించాల్సి ఉంటుంది.

క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ తీసినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య అంచనాలు. మొదటి భాగం ఎంత పెద్ద విజయాన్ని అందుకుంటే, రెండో భాగంపై అంత భారీ ప్రెజ‌ర్ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇదే కారణంగా సీక్వెల్స్ ఫెయిల్ అవుతుంటాయి. ప్రేక్షకులు తమకు గుర్తున్న అనుభూతిని మళ్లీ కోరుకుంటారు, కానీ అదే ఫార్ములాను రిపీట్ చేస్తే అది పాతగా అనిపిస్తుంది. కొత్తగా ప్రయత్నిస్తే, ఒరిజినల్ ఫీల్ మిస్ అవుతుందని విమర్శలు వస్తాయి. ఈ రెండు మధ్య బ్యాలెన్స్ సాధించడం చాలా కష్టం.

దేవి2 విషయంలో ఈ ఛాలెంజ్ మరింత ఎక్కువ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రియేటివ్ బ్యాక్‌బోన్ అయిన కోడి రామకృష్ణ ఇప్పుడు లేరు. ఆయన ప్రత్యేక శైలి, దేవతా చిత్రాలపై ఉన్న పట్టుదల, ఎమోషనల్ నేరేషన్.. అన్నీ కలిసి దేవి సినిమాకి ప్రాణం పోశాయి. ఇప్పుడు ఆ విజన్ లేకుండా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడం నిజంగా పెద్ద సవాల్. పైగా హీరోయిన్ సెలెక్షన్ కూడా కీలకమే. అప్పట్లో టైటిల్ రోల్‌లో నటించిన ప్రేమకి వచ్చిన గుర్తింపు విశేషం. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపగలిగే నటిని ఎంపిక చేయడం ఈ ప్రాజెక్ట్ విజయానికి కీలకం అవుతుంది. స్టార్ హీరోయిన్ తీసుకోవాలా, లేక ఫ్రెష్ ఫేస్‌తో వెళ్లాలా అనే దానిపై కూడా చర్చ కొనసాగుతోంది. మొత్తానికి దేవి2 ఓ మామూలు సీక్వెల్ లాగా కాకుండా నాస్టాల్జియా, టెక్నాలజీ, అంచనాలు, రిస్క్ అన్నీ క‌లిసిన ప్రాజెక్టుగా నిలుస్తోంది. హిట్ అయితే ఎంఎస్ రాజుకు ఇది భారీ రీఎంట్రీ అవుతుంది. కానీ ఫెయిల్ అయితే క్లాసిక్ దేవి సినిమాకు ఉన్న ఇమేజ్‌పై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.

Tags:    

Similar News