Tupaki Exclusive : ప్యారడైజ్ ఇంట్రడక్షన్ ఫైట్.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన ఫైట్ మాస్టర్ సతీష్!
దసరా వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దసరా వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో నాని ఇంట్రడక్షన్ ఫైట్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా ఇప్పటికే మొదలైంది. అయితే ఆ ఫైట్ వెనుక కష్టాన్ని, సెట్ లో ఎదురైన పరిస్థితులను ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ Tupakiకి ఇచ్చిన స్పెషల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
దసరాతో శ్రీకాంత్ ఓదెలతో తన రిలేషన్ మొదలైందని సతీష్ తెలిపారు. మొదట ఒక్క సీక్వెన్స్ కు ఛాన్స్ ఇచ్చారని, ఆ తర్వాత ట్రైన్ సీక్వెన్స్, క్లైమాక్స్ కు పని చేసే అవకాశం వచ్చిందన్నారు. దసరా క్లైమాక్స్ ఫైట్ దాదాపు 17- 18 నిమిషాల పాటు ఉండటంతో అది తనకు ఎంతో ఎనర్జీ ఇచ్చిందని చెప్పారు. ఆ సినిమాలో నాని చేసిన రిస్క్ లు చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఇక ప్యారడైజ్ ఇంట్రడక్షన్ ఫైట్ కోసం శ్రీకాంత్ ఓదెల భారీ అంచనాలు పెట్టుకున్నారని చెప్పారు.
ఆ ఫైట్ చూసినప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లాలని దర్శకుడు తనతో చెప్పారన్నారు. అందుకే ఫైట్ ను చాలా పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలిపారు. ముందుగా ఒక్క రోజు రిహార్సల్ అడిగి.. దాదాపు ఒక నిమిషం 15 సెకన్ల ఫైట్ ను సిద్ధం చేసి శ్రీకాంత్ ఓదెలకు చూపించారట. అది చూసిన దర్శకుడు చాలా ఇంప్రెస్ అయ్యారని సతీష్ తెలిపారు. ఆ తర్వాత ఫైట్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ను మరింత పెంచి షూటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు.
అయితే ఆ ఫైట్ షూటింగ్ అంత ఈజీగా జరగలేదట. జైలు సెట్ లో పొగ, ఫైర్, దుమ్ము ఎక్కువగా ఉండటంతో లోపల ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేదని సతీష్ వెల్లడించారు. కొంతమంది బయటకు వెళ్లిపోయినా.. తాను మాత్రం ఫైటర్స్ ను తన దగ్గరే ఉండాలని చెప్పేవాడినన్నారు. కెమెరాలు, ఇతర ఎక్విప్మంట్స్ కు ఏం జరిగినా సరే.. కావాల్సిన షాట్ పర్ఫెక్ట్ గా రావాలన్న డెడికేషన్ తో పనిచేశామని చెప్పారు.
ఆ ఫైట్ కోసం లోకల్ ఫైటర్లతో పాటు ముంబై, వియత్నాం నుంచి తీసుకొచ్చినట్లు సతీష్ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన కొన్ని స్పెషల్ పొజిషన్స్ ను తీసుకుని, వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కమర్షియల్ ఫైట్ గా రూపొందించినట్లు చెప్పారు. నాని ప్రతి షాట్ కు సిద్ధంగా ఉంటారని, సినిమాపై ఆయనకు ఉన్న ప్యాషన్ అలా ఉంటుందని చెప్పారు. ఫైట్ లో ట్రైలర్ లో కనిపించే కొన్ని కష్టమైన షాట్లను నాని స్వయంగా చేసినట్లు వెల్లడించారు.
చేతిపై తిరిగే ఓ షాట్ కూడా నాని ఎలాంటి డూప్ లేకుండా చేశారని చెప్పారు. అయితే ఫైట్ లోని మరిన్ని హైలైట్స్ ఇప్పుడే రివీల్ చేయలేనని స్పష్టం చేశారు. ఫైట్స్ సమయంలో గాయాలు కూడా అయ్యాయని సతీష్ తెలిపారు. అయితే అవసరమైన జాగ్రత్తలు తీసుకుని షూట్ చేశామని చెప్పారు. ఫైనల్ గా ప్యారడైజ్ ఇంట్రడక్షన్ ఫైట్ ను ప్రేక్షకులు థియేటర్ లో చివరి వరకు అరుస్తూ, విజిల్స్ వేస్తూ చూడాలన్న టార్గెట్ తోనే రూపొందించినట్లు రియల్ సతీష్ వెల్లడించారు. మరి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.