డిసెంబర్ కేరాఫ్ బ్లాక్ బస్టర్స్!
ఒకప్పుడు సినిమా రిలీజ్ సీజన్ అంటే? దసరా, సంక్రాంతి పండుగలు ఎక్కువగా హైలైట్ అయ్యేవి. ఆ రెండు సీజన్లలలో స్టార్ హీరోల సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అయ్యేవి.;
ఒకప్పుడు సినిమా రిలీజ్ సీజన్ అంటే? దసరా, సంక్రాంతి పండుగలు ఎక్కువగా హైలైట్ అయ్యేవి. ఆ రెండు సీజన్లలలో స్టార్ హీరోల సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అయ్యేవి. పండగ సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని భావించి రిలీజ్ చేసేవారు. ఆ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటే చాలు లాంగ్ రన్ లో మంచి వసూళ్లు సాధించేవి. కానీ నేడు సీన్ అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ లకు సీజన్లతో పనిలేదు. సరైన కంటెంట్ ఉంటే చాలు నెల ఏదైనా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. కొంత కాలంగా ఏడాది ముగింపు లో వచ్చే డిసెంబర్ మాసం భారీ విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది అన్నది కాదనలేని నిజం.
ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే? గత ఏడాది 2025 డిసెంబర్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ చిత్రం `ధురంధర్` రిలీజ్ అయింది. ఈ సినిమా 500 కోట్లు సాధిస్తే ఎక్కువ? అనుకున్నారు. కానీ ఈ చిత్రం లాంగ్ రన్ లో 1300 కోట్లకుపై గా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ అయి `ఆర్ ఆర్ ఆర్`, `కేజీఎఫ్` రికార్డులను తుడిచి పెట్టేసింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఇమేజ్ ను `ధురంధర్` తెచ్చి పెట్టింది. 2024 డిసెంబర్ లో బన్నీ నటించిన `పుష్ప2` సైతం అదే రేంజ్ లో రికార్డుల మోత మ్రోగించింది.
పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఏకంగా 1800 కోట్ల వసూళ్లతో హిందీ హీరోలకే సవాల్ విసిరిన చిత్రంగా నిలిచింది. `పుష్ప ది రైజ్` కూడా 2021 డిసెంబర్ లోనే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి 400 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన `యానిమల్` కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 900 కోట్ల వసూళ్లను సాధించింది. 2023 డిసెంబర్ లోనే రిలీజ్ అయిన `సలార్` సీజ్ ఫైర్` కూడా 700 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇదే ఏడాది టాలీవుడ్ నుంచి డిసెంబర్ లో రిలీజ్ అయిన `అఖండ 2` కూడా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
దీంతో 2026 డిసెంబర్ లో ఎలాంటి రికార్డులు నమోదవుతాయనే చర్చ అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే డిసెంబర్ రేసులో కొన్ని రిలీజ్ లు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న `రౌడీజనార్దన` డిసెంబర్ లోనే డేట్ లాక్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `స్పిరిట్` కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుందని సమాచారం. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ నటిస్తోన్న `కింగ్` చిత్రం కూడా డిసెంబర్ లోనే రిలీజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.