రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
బాలీవుడ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డేవిడ్ ధావన్ రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.;
బాలీవుడ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డేవిడ్ ధావన్ రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతోన్న `హై జవానీ తో ఇష్క్ హోనా హై` చిత్రమే దర్శకుడిగా తన చివరి సినిమా అయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో 45 చిత్రాలను తెరకెక్కించిన కామెడీ కింగ్ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం డేవిడ్ ధావన్ అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో డేవిడ్ ధావన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు స్వయంగా వెల్లడించారు.
షూటింగ్ సెట్స్‌లో తండ్రి ఆరోగ్యం పట్ల వరుణ్ ధావన్ చూపిన శ్రద్ధను గుర్తు చేసుకున్నారు. `నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు వరుణ్ నా కుమారుడిలా కాకుండా ఒక బాధ్యతాయుతమైన నటుడిలా ప్రవర్తిస్తాడు. కానీ షూటింగ్ పూర్తయ్యాక నా ఆరోగ్యం గురించి డాక్టర్లతో నిరంతరం సంప్రదించి కంటికి రెప్పలా చూసుకున్నాడు` అని డేవిడ్ భావోద్వేగానికి లోనయ్యారు. నటుడిగా వరుణ్ ధావన్ ఎదుగుదలపై కూడా డేవిడ్ ధావన్ ప్రశంసలు కురిపించారు. వరుణ్ తన 13-14 సినిమాల అనుభవంతో సెట్స్‌లో ఎంతో పరిణితితో వ్యవహరిస్తున్నాడని దర్శక-నటుల మధ్య ఉండాల్సిన మంచి ట్యూనింగ్ తమ మధ్య ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా వరుణ్ నటించిన `బోర్డర్ 2` చిత్రంలోని నటన అద్భుతమని కొని యాడారు. కుమారుడితో కలిసి పని చేయడం ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుందని కానీ ఆరోగ్యం సహకరించడం లేదని అభిప్రాయపడ్డారు. `ఈ సినిమా తర్వాత నేను కేవలం వరుణ్ తండ్రిగానే ఉండాలనుకుంటున్నాను అని డేవిడ్ ధావన్ చెప్పడం రిటైర్మెంట్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇకపై తన సమయాన్ని కుటుంబంతో గడపాలని, కుమారుడి ఎదుగుదలను చూసి మురిసిపోవాలని ఆయన కోరుకుంటున్నారు.
అయితే దర్శకుడిగా ఆయన పీఠం ఖాళీ అవుతుండటం ఆయన మార్క్ కామెడీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను కొంత విచారానికి గురి చేస్తోంది. గతంలో గోవింద, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో ఆయన సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. రమేష్ తౌరానీ నిర్మాణంలో రూపొందుతున్న `హై జవానీ తో ఇష్క్ హోనా హై` చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా డేవిడ్ ధావన్ కెరీర్ లో ఒక గ్రాండ్ ఫినిషింగ్‌లా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.