కోర్ట్.. ఓటీటీ డేట్ వచ్చేసింది
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం అంటే.. కోర్ట్ అనే చెప్పాలి.;
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం అంటే.. కోర్ట్ అనే చెప్పాలి. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో కొత్త దర్శకుడు రామ్ జగదీష్ రూపొందించిన ఈ చిత్రం గత నెల 14న విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో స్టార్లెవరూ లేరు. ప్రియదర్శి ముఖ్య పాత్ర పోషించాడు. పది కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ.. థియేటర్ల నుంచే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీన్ని బట్టే ఇదెంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. అక్కడ మిస్సయిన వాళ్లు, ఇంకోసారి చూడాలనుకున్న వాళ్లు.. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు డేట్ కూడా వచ్చేసింది. ఈ నెల 11న ‘కోర్ట్’ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ‘కోర్ట్’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఈ సినిమా డిజిటల్‌గా రిలీజ్ కానుంది. టీనేజీలో ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడడం.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో అమ్మాయి మేనమామ అబ్బాయిని పోలీసులకు పట్టించి.. తనపై పోక్సో సహా అనేక కేసులు పెట్టించి ఇరికించడం.. అన్ని దారులూ మూసుకుపోయి అబ్బాయి కేసులో పీకల్లోతు ఇరుక్కుపోవడం.. ఈ స్థితిలో ఒక యువ లాయర్ తన ఫస్ట్ కేస్‌గా దీన్ని టేకప్ చేసి.. సమర్థవంతమైన వాదనలతో ఈ కుర్రాడిని బయట పడేయడం.. ఇదీ ‘కోర్ట్’ కథాంశం. రసవత్తరమైన కథనం, మంచి సందేశం తోడవడంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంది.