వార్ని... కోర్ట్‌ శ్రీదేవి అప్పుడే అక్కడికి వెళ్లిందా?

నాని సమర్పణలో వచ్చిన 'కోర్ట్‌' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.;

Update: 2025-07-07 21:30 GMT

నాని సమర్పణలో వచ్చిన 'కోర్ట్‌' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. చిన్న వయసు అయినప్పటికీ చక్కగా నటించింది అంటూ చాలా మంది విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కోర్ట్‌ సినిమాలోని జాబిల్లి పాత్రకు శ్రీదేవి సరిగ్గా సరిపోయిందని, ఆ పాత్రలో శ్రీదేవి కనిపించకుండా జాబిల్లి కనిపించిందని చాలా మంది ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా కొంత గుర్తింపు దక్కించుకున్న శ్రీదేవి 'కోర్ట్‌' సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకుంది. ముందు ముందు ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో ఆఫర్లు తక్కువ ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్స్‌గా నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ అరుదైన హీరోయిన్స్‌ జాబితాలో ఖచ్చితంగా శ్రీదేవి ఉంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్ట్‌ సినిమా తర్వాత ఒకటి రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని శ్రీదేవి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. ఇండస్ట్రీలో నిలిచి పోయే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి పాత్రల కోసం వెయిట్‌ చేసింది. టాలీవుడ్‌ నుంచి అలాంటి ఆఫర్‌ దక్కలేదు కానీ, కోలీవుడ్‌లో ఈ అమ్మడికి అలాంటి ఆఫర్‌ దక్కిందని తెలుస్తోంది.

టాలీవుడ్‌లో కాకుండా కోలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యత ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అందుకే తెలుగు సినిమాల్లో కంటే తమిళ్‌ సినిమాల్లో నటించడం ద్వారా కెరీర్‌ లో స్టార్‌డం దక్కించుకోవచ్చు. అందుకే కావచ్చు శ్రీదేవి తన తదుపరి సినిమాను తమిళ్‌లో చేస్తుంది. కేజేఆర్‌ హీరోగా రూపొందుతున్న రెండవ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా ఎంపిక అయింది. నిర్మాతగానూ సినిమాలను నిర్మిస్తూ ఉండే కేజేఆర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. తమిళనాడు సాంప్రదాయాల ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మినీ స్టూడియోస్‌ బ్యానర్‌లో రూపొందబోతున్న ఈ సినిమాకు రీగన్‌ స్టానిస్లాస్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. జిబ్రాన్‌ సంగీతం అందించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో కోలీవుడ్‌లో శ్రీదేవి మంచి పేరు తెచ్చుకుంటే మరిన్ని సినిమా ఆఫర్లు దక్కడం ఖాయం. కోలీవుడ్‌లో సినిమాలతో హిట్‌ సాధిస్తే తప్పకుండా టాలీవుడ్‌లోనూ ఈమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశాలు వస్తాయి. తెలుగు అమ్మాయి అంజలి కోలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకున్న తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాగే ఇప్పుడు శ్రీదేవికి రిపీట్‌ కానుందా అనేది చూడాలి.

Tags:    

Similar News