అది నా కెరీర్లోనే డిఫరెంట్ క్యారెక్టర్
ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో తక్కువ టైమ్ లోనే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు లోకేష్ కనగరాజ్.;
ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో తక్కువ టైమ్ లోనే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న కూలీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకేష్, రజినీకాంత్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో కూలీపై ముందునుంచే అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా చాలా భారీగా ఉన్న విషయం తెలిసిందే. కూలీలో కన్నడ స్టార్ ఉపేంద్ర, టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.
కాగా కూలీలో నాగార్జున విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో తాను సైమన్ అనే విలన్ గా కనిపించనున్నానని నాగ్, కుబేర సినిమా ప్రమోషన్స్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా కూలీ గురించి మరోసారి నాగ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకు చేసిన పాత్రలకు కూలీ సినిమాలోని క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని, సినిమాలో మెయిన్ విలన్ తానే కావడంతో తనకు, రజినీకాంత్ కు మధ్య చాలా సీన్స్ ఉంటాయని నాగ్ తెలిపారు.
ఇదే సందర్భంగా తనకు ఆమిర్ ఖాన్ తో ఎలాంటి సీన్స్ ఉండవనే విషయాన్ని కూడా నాగ్ వెల్లడించారు. సినిమాలో తామిద్దరూ కలిసి కనిపించే సీన్స్ ఉండవని, కూలీలో తమ చాప్టర్లు వేర్వేరుగా ఉంటాయని, కానీ ఆమిర్ నటించిన కొన్ని సీన్స్ ను చూశానని, చాలా అద్భుతంగా ఉన్నాయని, కూలీలో కొత్త ఆమిర్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతారని నాగ్ అన్నారు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కూలీలోని స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేశారు. కాగా కూలీ మూవీని ఐమ్యాక్స్ ఫార్మాట్ లో కూడా తీసుకొస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.