సినిమాటోగ్రఫీ మ్యాజిక్: స్క్రీన్‌పై హీరోల లోపాలను కవర్ చేసే టాప్ 10 టెక్నిక్స్

వెండితెరపై ఒక స్టార్ హీరో కనిపించే విధానం సాధారణ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

Update: 2026-06-12 04:49 GMT

వెండితెరపై ఒక స్టార్ హీరో కనిపించే విధానం సాధారణ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే ప్రతి హీరో పర్ఫెక్ట్ హైట్ లేదా కటౌట్‌తోనే ఉండాలని లేదు. ఒక స్టార్ హీరో సాధారణం కంటే తక్కువ ఎత్తు ఉన్నా లేదా కాస్త అధిక బరువు ఉన్నా.. థియేటర్లో వారిని ఎంతో పవర్‌ఫుల్‌గా... పొడవుగా చూపించడం క‌చ్చితంగా సాధ్యమవుతుంది. దీని వెనుక దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల అద్భుతమైన సాంకేతిక సమన్వయం ఉంటుంది. తెరపై హీరో రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించే `టాప్ 10 సినిమాటోగ్రాఫిక్ టెక్నిక్స్` గురించి ఈ రంగంలో నిపుణులు చెప్పిన విష‌యాలు ఇవే..

*లో-యాంగిల్ షాట్స్ : కెమెరాను కింది భాగంలో ఉంచి పైకి ఫోకస్ చేయడం ద్వారా హీరో చాలా పొడవుగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు.

*సెలెక్టివ్ ఫ్రేమింగ్ : హీరో ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు లాంగ్ షాట్స్ తగ్గించి, క్లోజప్ లేదా మిడ్-షాట్స్ లో మాత్రమే చూపించాలి.

ఫోర్స్డ్ పెర్స్పెక్టివ్ : ఆప్టికల్ భ్రమను సృష్టించడం ద్వారా కెమెరాకు దగ్గరగా ఉన్న వస్తువులు పెద్దవిగా, దూరంగా ఉన్నవి చిన్నవిగా కనిపించేలా చేయడం.

*స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ : హీరో కంటే ఎక్కువ ఎత్తు ఉన్న సపోర్టింగ్ యాక్టర్లను లేదా విలన్లను హీరో కంటే కాస్త వెనుక నిలబెట్టడం లేదా కింద కూర్చోబెట్టడం చేయాలి.

*ఆపిల్ బాక్సెస్ & ఎలివేటెడ్ ప్లాట్‌ఫార్మ్స్ : క్లోజప్ సీన్స్.. రొమాంటిక్ సీన్లలో హీరో ఎత్తు పెంచడానికి కింద చెక్క పెట్టెలు (బాక్సులు) లేదా చిన్న ప్లాట్‌ఫార్మ్‌లు వాడటం.

*లెన్స్ సెలెక్షన్ : వైడ్-యాంగిల్ లెన్స్‌లను జాగ్రత్తగా వాడుతూ... టెలిఫోటో లెన్స్‌ల ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసి హీరో రూపాన్ని హైలైట్ చేయడం.

*లైటింగ్ అండ్ షాడోస్ : అధిక బరువు ఉన్న హీరోలను సన్నగా చూపించడానికి `చియారోస్కురో` లాంటి సైడ్ లైటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి ఒకవైపు షాడోస్ క్రియేట్ చేయడం.

*కాస్ట్యూమ్ - వర్టికల్ స్ట్రైప్స్ గైడెన్స్ : నిలువు గీతలు ఉన్న దుస్తులు లేదా ఒకే రంగు దుస్తుల ద్వారా హీరో ఎత్తుగా ఉన్న భ్రమ కల్పించడం.

*డైనమిక్ కెమెరా మూవ్‌మెంట్: ట్రాకింగ్ షాట్స్ ద్వారా కెమెరాను నిరంతరం కదుపుతూ ప్రేక్షకులు హీరో ఎత్తును గమనించకుండా చేయడం.

*ఎడిటింగ్ పేసింగ్ : ఎడిటింగ్ రూమ్‌లో పొట్టిగా అనిపించే వైడ్ షాట్ల నిడివిని తగ్గించి... పవర్‌ఫుల్ యాంగిల్స్ ఉన్న షాట్లను ఎక్కువగా ఉంచడం.

తెరపై ఒక నటుడి ప్రెజెన్స్ విషయంలో కేవలం కెమెరామెన్ మాత్రమే బాధ్యుడు కాదు.. ఇందులో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అనే ముగ్గురి పాత్ర సమానంగా ఉంటుంది. మొదటగా... ఒక సన్నివేశాన్ని ఎలా డిజైన్ చేయాలి? హీరో పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ (సహ నటులు) శరీర దారుఢ్యం ఎలా ఉండాలి? అనేది ప్లాన్ చేసే బాధ్యత `దర్శకుడి`ది. ఆ విజన్‌ను తన కెమెరా యాంగిల్స్, లైటింగ్ - ఫ్రేమింగ్‌తో స్క్రీన్‌పై రిచ్‌గా ఆవిష్కరించే బాధ్యత `సినిమాటోగ్రాఫర్‌`ది. వీరద్దరూ తీసిన వందలాది షాట్లలో.. హీరో వీక్‌గా లేదా పొట్టిగా కనిపించే ఫ్రేమ్‌లను కట్ చేసి... అత్యంత పవర్‌ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చే షాట్లను మాత్రమే పేర్చి ఉన్న‌తంగా అమర్చే బాధ్యత `ఎడిటర్‌`పై ఉంటుంది. ఈ మూడు విభాగాలు కలిసి పనిచేసినప్పుడే ఒక పర్‌ఫెక్ట్ లుక్ వస్తుంది.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల చరిత్రను గమనిస్తే.. అంతగా ఎత్తు లేని స్టార్ హీరోలను ఎంతో తెలివిగా కవర్ చేస్తూ.. వారిని బాక్సాఫీస్ వద్ద తిరుగులేని సూపర్ స్టార్లుగా చూపించిన సినిమాటోగ్రాఫర్ల ట్రాక్ రికార్డ్ అద్భుతమైనది. బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కోలీవుడ్‌లో వర్సటైల్ స్టార్ సూర్య లాంటి హీరోలు తమకంటే ఎక్కువ ఎత్తు ఉన్న కత్రినా కైఫ్, అనుష్క శెట్టి వంటి హీరోయిన్లతో నటించినప్పుడు కూడా ఎక్కడా ఎత్తు తక్కువగా అనిపించలేదు. దీని వెనుక పీసీ శ్రీరామ్, రవి కే. చంద్రన్, సంతోష్ శివన్ వంటి దిగ్గజ సినిమాటోగ్రాఫర్ల కృషి ఎంతో ఉంది. వారు వాడిన అప్-షూట్ కెమెరా యాంగిల్స్ .. క్లోజ్-అప్ టెక్నిక్స్ వల్ల ఆ హీరోలు ఎత్తులో తమ హీరోయిన్లకు సమఉజ్జీలుగా, స్క్రీన్‌పై ఎంతో గ్రేస్‌ఫుల్‌గా మెప్పించగలిగారు.

అయితే ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన `దేవర` చిత్రంలోని లుక్ అభిమానుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం .. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలలో విపరీతమైన టాప్-యాంగిల్స్.. వైడ్ ఫ్రేమ్స్‌ను ఉపయోగించారని ప‌లువురు నిపుణులు విశ్లేషించారు. ఎన్టీఆర్ సహజంగానే మంచి యాక్టింగ్ పర్సనాలిటీ అయినా కానీ ఆయన చుట్టూ భారీ శరీర దారుఢ్యం ఉన్న నార్త్ ఇండియా ఫైటర్లను- విలన్లను నిలబెట్టడం, అదే సమయంలో వైడ్ కెమెరా షాట్స్ వాడటం వల్ల తారక్ స్క్రీన్‌పై చాలా పొట్టిగా - ఆ ఎలిమెంట్స్ మధ్య ఇరుక్కుపోయినట్లు కనిపించారు. రత్నవేలు లాంటి సీనియర్ టెక్నీషియన్ ఎన్టీఆర్ లార్జర్-ద్యాన్-లైఫ్ మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసే లో-యాంగిల్ షాట్స్‌ను తగినంతగా వాడకపోవడమే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే టీమ్ ఎఫ‌ర్ట్ విష‌యంలో ఒక‌రినే నిందించ‌డం స‌రికాద‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి.

సినిమా అనేది ఒక అద్భుతమైన విజువల్ ఇల్యూజన్ (దృశ్య భ్రమ). నటుల శారీరక పరిమితులు ఏవైనా ఉన్నా సరైన సినిమాటోగ్రాఫిక్ నైపుణ్యాలు - ఎడిటింగ్ టెక్నిక్స్ తోడైతే ఎలాంటి లోపాన్నైనా అధిగమించవచ్చు. ఒక నటుడిని ఇండస్ట్రీలో స్టార్‌గా నిలబెట్టేది కేవలం వారి ఎత్తు లేదా బరువు కాదు.. వారి నటన .. ఆ నటనను ప్రపంచానికి గొప్పగా చూపించే సాంకేతిక నిపుణుల ప్రతిభ మాత్రమే అని ఈ సినిమాటోగ్రఫీ మ్యాజిక్ నిరూపిస్తోంది.

Tags:    

Similar News