విజువల్స్‌కే కాదు.. కథలకూ రెడీ అయిన రత్నవేలు!
సినిమాటోగ్రఫీ అంటే కేవలం అందమైన ఫ్రేములు కాదు, కథకు ప్రాణం పోసే విజువల్ భాష.
సినిమాటోగ్రఫీ అంటే కేవలం అందమైన ఫ్రేములు కాదు, కథకు ప్రాణం పోసే విజువల్ భాష. ఆ భాషను అత్యంత బలంగా మాట్లాడగలిగిన టెక్నీషియన్లలో ఆర్. రత్నవేలు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రతి సినిమాకు కొత్త టెక్స్చర్, కొత్త మూడ్, కొత్త విజువల్ ఐడెంటిటీ ఇవ్వడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినిమాలో కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు అలాంటి స్టార్ సినిమాటోగ్రాఫర్ త్వరలోనే డైరెక్టర్ గా మారి మెగా ఫోన్ పట్టబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు కథలను సిద్ధం చేసుకున్న రత్నవేలు, వాటిలో ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కెమెరా వెనుక ఎన్నో ప్రపంచాలను సృష్టించిన వ్యక్తి, ఇప్పుడు కథ చెప్పే బాధ్యతను కూడా స్వయంగా తీసుకోవాలని నిర్ణయించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన విజువల్ సెన్స్‌ను చూసిన ప్రేక్షకులు, డైరెక్టర్ గా రత్నవేలు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రోబో, రంగస్థలం, సైరా, 1 నేనొక్కడినే, సరిలేరు నీకెవ్వరు, దేవర వంటి సినిమాల్లో ఆయన చూపించిన ఫ్రేమింగ్, లైటింగ్, కలర్ టోన్స్ ఆ సినిమాలకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. ముఖ్యంగా రంగస్థలంలో ఆయన సృష్టించిన గ్రామీణ వాతావరణం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఒక కాలాన్ని తెరపై జీవంతో చూపించగల సామర్థ్యం రత్నవేలులో ఉందని అప్పుడే స్పష్టమైంది. అందుకే ఇప్పుడు ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేయడం కేవలం మరో టెక్నీషియన్ మార్పుగా కాకుండా, ఒక విజువల్ స్టోరీటెల్లర్ కొత్త ప్రయాణంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన పెద్ది సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రత్నవేలు చెప్పిన విషయాలు కూడా ఆయన క్రియేటివ్ ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. 40 ఏళ్ల క్రితం విజయనగరం ప్రాంత వాతావరణాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక కలర్ ప్యాలెట్ రూపొందించడం, కొన్ని కీలక సన్నివేశాలను ఫిల్మ్ నెగెటివ్‌పై షూట్ చేయడం వంటి ప్రయోగాలు ఆయన సినిమాపై పెట్టే శ్రద్ధను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తెరకెక్కించిన క్రికెట్ మ్యాచ్ సీన్స్ ఆడియన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన చెబుతున్నారు.
ఇలాంటి డీటైలింగ్‌పై అంత పట్టున్న వ్యక్తి డైరెక్టర్ గా మారితే, కథ చెప్పే విధానంలో కూడా కొత్తదనం కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బాలు మహేంద్ర, పీసీ శ్రీరామ్, సంతోష్ శివన్, కె.వి. ఆనంద్ లాంటి సినిమాటోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారి తమ ప్రత్యేక ముద్ర వేసినట్లే, రత్నవేలు కూడా విజువల్ ఎమోషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ గా సక్సెస్ కావాలంటే కేవలం విజువల్స్ సరిపోవు. బలమైన కథ, క్యారెక్టర్ల ఎమోషన్స్, ఆడియన్స్ ను చివరి వరకు కట్టిపడేసే నేరేషన్ కూడా అవసరం. రత్నవేలు ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఆయన కూడా అదే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉన్న యాక్షన్ థ్రిల్లర్‌పై దృష్టి పెట్టడం ఆయన కథ చెప్పే పద్ధతిపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కెమెరా వెనుక తన ప్రతిభతో ఎన్నో హిట్ సినిమాలకు ప్రాణం పోసిన రత్నవేలు, ఇప్పుడు డైరెక్టర్ గా కూడా కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఆయన మొదటి సినిమా కేవలం విజువల్ వండర్‌గా మిగిలిపోతుందా? లేక ఎమోషన్స్ తో ఆడియన్స్ ను కదిలించే పూర్తి స్థాయి సినీ అనుభూతిగా నిలుస్తుందా? అన్నది చూడాలి.