చిరు-అనిల్‌ మూవీ సెట్‌లో YD రాజు..!

గత కొన్ని రోజులుగా చిరు-అనిల్ మూవీలో సంక్రాంతికి వస్తున్నాం స్టార్‌ వైడీ రాజు అలియాస్‌ వెంకటేష్‌ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.;

Update: 2025-06-21 05:18 GMT

మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరు-అనిల్‌ మూవీ షూటింగ్‌ చకచక జరుగుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొంది 2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే చిరంజీవితో ఆయన రూపొందిస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 2026 సంక్రాంతికి రావడం కన్ఫర్మ్‌ అయింది. సంక్రాంతికి వస్తున్నాంను మించి సినిమా ఉంటుంది అనే విశ్వాసం ను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి పబ్లిసిటీకి ఉపయోగపడే విధంగా కొన్ని స్పెషల్‌ ఎంట్రీలను అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా చిరు-అనిల్ మూవీలో సంక్రాంతికి వస్తున్నాం స్టార్‌ వైడీ రాజు అలియాస్‌ వెంకటేష్‌ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ విషయమై మరింత స్పష్టత రాబోతుంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి, వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సెట్‌ను ఏర్పాటు చేశారని, వీరిద్దరి కాంబో సీన్స్‌కి థియేటర్‌లు దద్దరిల్లే విధంగా ప్రేక్షకులు నవ్వడం ఖాయం అని, అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అనిల్‌ రావిపూడిపై నమ్మకంతో వెంకటేష్ ఈ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి సినిమాలో స్టార్స్ గెస్ట్‌ అప్పియరెన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి చాలా స్పెషల్‌ గెస్ట్‌ అప్పియరెన్స్ కావడంతో అభిమానులతో పాటు, ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్‌ హీరోలను వెండి తెరపై కలిపి చూడాలని చాలా కాలంగా సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుంది. వెంకటేష్‌ కి సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి అడిగితే ఎంతటి పెద్ద హీరో అయినా ఓకే అనాల్సిందే. ఇదే జోష్‌ లో తన భగవంత్ కేసరిని కూడా మెగా-అనిల్ మూవీలో నటింపజేయాలని కొందరు అనిల్‌ రావిపూడిని కోరుతున్నారు. బాలకృష్ణ గురించి ఎలాంటి అప్డేట్‌ లేదు కానీ వెంకటేష్‌/YD రాజు మాత్రం మెగా మూవీ షూట్‌లో జాయిన్‌ కాబోతున్నాడు.

వెంకటేష్‌ ఈ సినిమా కోసం దాదాపుగా నెల రోజుల పాటు డేట్లు కేటాయించారని టాక్‌ వినిపిస్తుంది. అందులో కొన్ని రోజులు ప్రమోషన్‌కి కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్‌, మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చిరంజీవి నుంచి రానటువంటి కామెడీ ఎంటర్‌టైన్మెంట్‌ మూవీగా ఈ సినిమా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేశాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌ లోడింగ్‌ అంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

Tags:    

Similar News