మెగా కన్ఫ్యూజ‌న్‌పై క్లారిటీ వాళ్లే ఇవ్వాలా?

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి `మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని రెట్టించి ఉత్సాహంతో ఉన్నారు.;

Update: 2026-04-11 10:30 GMT

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి `మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని రెట్టించి ఉత్సాహంతో ఉన్నారు. అదే ఉత్సాహంతో మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తార‌ని, కొత్త ప్రాజెక్ట్స్‌ని ప‌ట్టాలెక్కిస్తార‌ని అంతా ఆశించారు. కానీ అది ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేదు. పైగా మెగాస్టార్ ప్రాజెక్ట్‌ల చుట్టూ మెగా క‌న్ఫ్యూజ‌న్ కొల‌కొని అబిమానుల్ని ఒకింత అస‌హ‌నానికి గురి చేస్తోంది. ఎప్పుడో మొద‌లు పెట్టిన `విశ్వంభ‌ర‌` ఇప్ప‌టికీ పూర్తి కాలేదు. మ‌రోసారి `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, అంజి లాంటి ఫీల్‌ని ఈ సినిమాతో చిరు అందిస్తార‌ని ఆశ‌గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

కానీ అది ఒక్క అడుగు కూడా ముందుకు క‌ద‌ల‌డం లేదు. బ‌య‌టికి మ‌రో రెండు నెల‌ల్లో రిలీజ్ అవుతుంద‌ని చెబుతున్నా ప్రాక్టిక‌ల్‌గా మాత్రం కుదిరేలా క‌నిపించ‌డం లేదు. కార‌ణం అనుకున్న విధంగా గ్రాఫిక్స్ పూర్తి కాక‌పోవ‌డ‌మేన‌ని ఇన్ సైడ్ టాక్‌. దాంతో టీమ్ చెబుతున్న జూలై 10న `విశ్వంభ‌ర‌` రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అది స‌రే కొత్త సినిమా అయినా మొద‌ల‌వుతుందా? అంటే దాని విష‌యంలోనూ ఎదురు దెబ్బ‌లే త‌గులుతున్నాయి. మెగాస్టార్ హీరోగా బాబి డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీ సెట్స్ పైకి రానున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీని త‌మిళంలో `జ‌న నాయ‌గ‌న్‌`, క‌న్న‌డ‌లో `టాక్సిక్‌` వంటి భారీ సినిమాల‌ని నిర్మించిన క‌న్న‌డ డిస్ట్రిబ్యూట‌ర్ వెంక‌ట్ కె. నారాయ‌ణ నిర్మించ‌నున్నారు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ చుట్టూ సెన్సార్ వివాదం త‌లెత్త‌డంతో రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్‌లు, ఓ పాట లీక్ అయిందంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో చిరు సినిమా ఓపెనింగ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లేన‌ని కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

ఈ నెల 14న లాంఛ‌నంగా ప్రారంభించి రెగ్యుల‌ర్ షూటింగ్‌ని మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేశారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇది జ‌రిగే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. మ‌ళ్లీ వాయిదా ప‌డి ప‌రిస్థితులు స‌ద్దుకున్నాక ఇది సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతుండ‌టంతో దీని ప్ర‌భావం మ‌రో ప్రాజెక్ట్‌పై ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే శ్రీ‌కాంత్ ఓదెల ప్రాజెక్ట్‌. ప్ర‌స్తుతం నానితో `ది ప్యార‌డైజ్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న శ్రీ‌కాంత్ ఓదెల దీని త‌రువాత చిరుతో ఓ భారీ మాస్ యాక్ష‌న్ మూవీని చేయ‌బోతున్నాడు.

అయితే ది ప్యార‌డైజ్‌` ఆల‌స్యం అవుతుండ‌టం, చిరు బాబి ప్రాజెక్ట్ కూడా ప‌ట్టాలెక్క‌డానికి వాయిదా ప‌డుతున్న నేప‌థ్యంలో శ్రీ‌కాంత్ ఓదెల ప్రాజెక్ట్ కూడా మ‌రింత‌గా ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మెగా ప్రాజెక్ట్‌ల‌పై నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌పై ఈ మెగా క‌న్ఫ్యూజ‌న్ ఏంట‌ని అంతా అంటున్నారు. `విశ్వంభ‌ర‌` రిలీజ్‌పై యూవీ ఇంత వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌డం లేదు. బాబితో సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` వ‌ల్ల క‌న్ఫ్యూన్‌లో ప‌డింది. దీనిపై మేక‌ర్స్ స్పందించ‌డం లేదు. ఈ రెండింటిపై మేక‌ర్స్ స్పందిస్తేనే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News