ఓటీటీ ఎంట్రీకి రెడీ అంటోన్న మెగాస్టార్
అయితే మంచి కథ వస్తే తాను కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీగా ఉన్నట్టు చిరంజీవి తాజాగా వెల్లడించాడు.;

టాలీవుడ్ లోని పలు సీనియర్ హీరోలు ఇప్పటికే ఓటీటీ ద్వారా ఆడియన్స్ కు చేరువైన సంగతి తెలిసిందే. వెంకటేష్ ఆల్రెడీ ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ద్వారా ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నాగ్ కూడా త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలొస్తున్నాయి. కానీ చిరంజీవి మాత్రం ఓటీటీలోకి వస్తాడని ఎవరూ ఊహించలేదు.
అయితే మంచి కథ వస్తే తాను కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీగా ఉన్నట్టు చిరంజీవి తాజాగా వెల్లడించాడు. ధనుష్, నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడుతూ, మంచి పాత్ర లభిస్తే ఓటీటీలో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఫ్యూచర్ లో అవసరమైతే ఓటీటీలో సినిమాలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నానని, దానికి ఇప్పట్నుంచే మానసికంగా సిద్ధపడాలని, అయితే ఓకే అన్నాను కదా అని రేపు ఉదయమే కథలతో నా ముందుకు రావొద్దంటూ సరదాగా వ్యాఖ్యానించారు చిరూ.
అదే ఈవెంట్ లో ఏషియన్ ఫిల్మ్స్ తో ఓ సినిమా చేస్తానని కూడా నిర్మాత సునీల్ కు చిరూ హామీ ఇచ్చాడు. చిరూకి సునీల్ తండ్రి నారాయణ దాస్ తో మంచి అనుబంధముంది. నారాయణ దాస్ తర్వాత సునీల్ నిర్మాతగా మారగా, ఇప్పుడు కుబేరతో సునీల్ కూతురు జాన్వి నిర్మాతగా మారింది. నిర్మాతగా మారిన జాన్వికి చిరూ అభినందనలు తెలుపుతూ, మీ నాన్న అడిగారు, నీకు చెప్పారో లేదో తెలియదు, మనం సినిమా చేస్తున్నామని అన్నారు. అయితే ధనుష్ చేసిన లాంటి ఛాలెంజింగ్ రోల్స్ వద్దని, మాస్, ఫన్, గ్లామర్ ఓరియెంటెడ్ పాత్రలే చూడమని సరదాగా అన్నాడు చిరూ. కుబేరలో దేవా పాత్ర తనకు వస్తే నో చెప్పేవాడినన్నారు. ఇలాంటి పాత్ర తనకు వచ్చినా చేయలేనని, ధనుష్ లాగా సహజంగా ఎవరూ నటించలేరని చిరూ అన్నాడు.
అయితే ఇప్పుడు చిరూ కోసం మంచి డైరెక్టర్ మరియు స్క్రిప్ట్ ను ఏషియన్ ఫిల్మ్స్ వెతకాల్సి ఉంది. ఆల్రెడీ కుబేరతో చిరూని ఇంప్రెస్ చేసిన శేఖర్ దగ్గర చిరూ కోసం ఏదైనా స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఈ సినిమా కార్యరూపం దాల్చే అవకాశముంది. ఎందుకంటే శేఖర్ తన తర్వాతి సినిమాను కూడా ఏషియన్ ఫిల్మ్స్ తో చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి శేఖర్, చిరూ కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే వీరిద్దరి కలయికలో త్వరలో సినిమా కుదిరే అవకాశముంది.