మేర్లపాక ట్యాలెంట్, వరుణ్ తేజ్ ప్రయోగాలను ఆకాశానికెత్తేసిన మెగాస్టార్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన 'మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్' వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఈ విజయాన్ని ఆస్వాధిస్తున్న చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక సినిమా విజయం సాధిస్తే డిస్ట్రిబ్యూటర్ల నుండి ఎగ్జిబిటర్ల వరకు ఎందరో ముఖాల్లో వెలుగులు నిండుతాయని.. ఈ సినిమాను థియేటర్లలో చూశాక స్వయంగా తానే వేడుకకు వస్తానని చెప్పి సక్సెస్ మీట్ లో పాల్గొన్నానని చిరంజీవి తెలిపారు.
ఈ వేడుకలో దర్శకుడు మేర్లపాక గాంధీ సృజనాత్మకతపై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు ఎన్నో హారర్ కామెడీలు వచ్చినా రాయలసీమ నేపథ్యంలో సాగే కథకి వినూత్నంగా కొరియన్ ఆత్మను, ఆ కల్చర్‌ను ముడిపెట్టడం గాంధీ అద్భుత ఆలోచనకు నిదర్శనమని కితాబిచ్చారు. ప్రణాళికాబద్ధంగా అనుకున్న సమయానికి, కేటాయించిన బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేసి నిర్మాతలకు మేలు చేయడం ప్రతి దర్శకుడూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక సక్సెస్ సూత్రమని పేర్కొంటూ.. గాంధీ నుంచి మున్ముందు ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు రావాలని ఆశీర్వదించారు.
మరొకవైపు కథానాయకుడు వరుణ్ తేజ్ నటనను.. అతడి కథల ఎంపికలోని వైవిధ్యాన్ని చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభం నుండి ముకుంద, కంచె, అంతరిక్షం వంటి సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ నటుడిగా తనను తాను నిరూపించుకోవాలనే తపన వరుణ్‌లో నిరంతరం కనిపిస్తుందని కొనియాడారు. ఇదే నిబద్ధతతో ముందుకు సాగితే వరుణ్ ఇండస్ట్రీలో ఒక విలక్షణమైన నటుడిగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకుంటాడన్నారు. పైగా ఈ విజయాన్ని సరదాగా వరుణ్ కుమారుడు వాయుతేజ్ ఖాతాలో వేస్తూ.. అతడే తమ కుటుంబానికి లక్కీ చార్మ్ అని వ్యాఖ్యానించారు.
సినిమాలోని ఇతర ప్రధాన పాత్రధారులైన సత్య కామెడీ టైమింగ్‌ని, రితిక , మురళీధర్ గౌడ్ నటప్రదర్శనలను చిరంజీవి అభినందించారు. ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు ఈ చిత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసిన సంగీత దర్శకుడు తమన్ వర్క్‌ని కొనియాడారు. తన తదుపరి బర్త్‌డే స్పెషల్ టీజర్ కోసం తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో స్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు. 2026 ద్వితీయార్థంలో పెద్ది, మా ఇంటి బంగారం చిత్రాల వరుసలో `కొరియన్ కనకరాజు` కూడా నిలవడం.. మంచి కంటెంట్‌కు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టంగడతారని నిరూపించిందని విశ్లేషించారు.
మెగాస్టార్ మాటలకు ఉప్పొంగిపోయిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమకు క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని నేర్పిన పెదనాన్న, బాబాయ్. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడటమే తన ప్రాధాన్యత అని ఎమోషనల్ అయ్యారు. ఆగస్టు 22 తన దృష్టిలో నేషనల్ హాలిడే లాంటిదని.. ఈ కొరియన్ కనకరాజు విజయం వల్ల ఈసారి మెగాస్టార్ బర్త్‌డే మరింత ప్రత్యేకంగా మారనుందని సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సంస్థలు, నటీనటులు -ప్రమోషన్లలో భాగమైన సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.