మెగా 158 లోకి మరో స్టార్ నటుడు..స్పెషల్ పోస్టర్ పంచుకున్న మేకర్స్!
అలా ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పైగా ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో విజయ పరంపర కొనసాగిస్తున్న చిరంజీవి.. మరోవైపు మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించడమే కాకుండా ఆ సినిమా షూటింగ్లో వేగంగా పాల్గొంటున్నారు కూడా..
అలా ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్ర బృందంలోకి మరో ప్రముఖ నటుడు చేరడంతో ఇప్పుడు మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఆగస్టు 9న ప్రముఖ నటులు మురళీ శర్మ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ బహుముఖ నటుడిని అధికారికంగా తమ చిత్ర బృందంలోకి ఆహ్వానిస్తూ.. ఒక స్పెషల్ పోస్టర్ని పంచుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రంలో ఆయన పాత్రను ప్రస్తుతం గోప్యంగా.. ఉంచినా.. ఆయన చేరికపై ఆసక్తిని మరింత పెంచుతోందనే చెప్పాలి.
ఇకపోతే ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కి ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బెంగాల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటుంది. 2026 మే 21న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కొల్లాచ్చి, హైదరాబాద్ ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇప్పటికే బాబీ కొల్లి ,చిరంజీవి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ఈ సినిమాలో ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుండగా, చిరంజీవి 35 ఏళ్ల తర్వాత తన ప్రాణ స్నేహితుడికి ఈ సినిమాలో విలన్ పాత్ర కల్పించడం విశేషం. ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నారు..
చిరంజీవి శరత్ కుమార్ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు.. శరత్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా ఎన్నో సందర్భాలలో పంచుకున్నారు కూడా.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన ప్రాణ స్నేహితుడని , ఆర్థికంగా తనకు ఎన్నోసార్లు సహాయం చేశారని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు . ఆయనతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కాకపోతే సరైన స్క్రిప్ట్ దొరకలేదని చెప్పిన శరత్ కుమార్ .. ఇప్పుడు చిరంజీవితో నటించే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1990లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అలాగే స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్లు నటించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించడంపై కూడా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.