లాలెట్టన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.. చిరు స్పెషల్ ట్వీట్ వైరల్!

దర్శకుడిగా.. నటుడిగా.. నిర్మాతగా భారతీయ చలన చిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారు మోహన్ లాల్. అద్భుతమైన ప్రతిభ వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అంటూ కేంద్రం కొనియాడింది.;

Update: 2025-09-21 11:48 GMT

చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను వరించింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేదీన శనివారం నాడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

దర్శకుడిగా.. నటుడిగా.. నిర్మాతగా భారతీయ చలన చిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారు మోహన్ లాల్. అద్భుతమైన ప్రతిభ వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అంటూ కేంద్రం కొనియాడింది. సెప్టెంబర్ 23వ తేదీన జరిగే 71 వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. 2023 సంవత్సరానికి గానూ మోహన్ లాల్ కి ఈ అవార్డు వరించినట్లు సమాచారం. ఇకపోతే మోహన్లాల్ కి ఈ అవార్డు లభించడంతో సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను, ఆయనతో ఉన్న అనుబంధాలను పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా మోహన్ లాల్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు వీరిద్దరి ఫోటోని షేర్ చేస్తూ.. "నా ప్రియమైన లాలెట్టన్.. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం.. ఐకానిక్ ప్రదర్శనలు.. భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు" అంటూ చిరంజీవి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన 'వృషభ' అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని నందకిషోర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను కూడా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో భారీ గ్రాఫిక్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో ఒక యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారు. మరోవైపు ఇటీవల L2 ఎంపూరాన్, తుడరుమ్, హృదయపూర్వం సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాలతో వరుసగా రూ.50 కోట్ల క్లబ్లో చేరి హ్యాట్రిక్ అందుకున్న తొలి మలయాళ హీరోగా రికార్డు సృష్టించారు మోహన్ లాల్. ఇప్పుడు ఒక ఘనత తర్వాత మరో ఘనతను సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏది ఏమైనా మోహన్ లాల్ ఎప్పటికప్పుడు తన అద్భుతమైన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు.

Tags:    

Similar News