సహాయం చేయడమే కాదు.. ఆ విషయంలోనూ చిరు స్పెషల్ కేర్..

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.;

Update: 2026-04-26 18:36 GMT

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన అసలైన గౌరవం ఎక్కువగా దాతృత్వం, సేవా కార్యక్రమాల వల్ల అని చెప్పాలి. గత పాతికేళ్లుగా ఆయన చేస్తున్న సేవలు ఎంతో మందికి కొత్త లైఫ్ ను అందిస్తున్నాయి. మెగాస్టార్ చొరవతో అనేక మంది మళ్లీ తమ జీవితాలను సరికొత్తగా మొదలు పెడుతున్నారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అవసరమైన వారికి సమయానికి రక్తం అందేలా దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు శిబిరాలు నిర్వహిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందిస్తున్నారు. అలాగే నేత్రదానం కార్యక్రమాల ద్వారా చూపు కోల్పోయిన వారికి కొత్త జీవితం ఇస్తున్నారు.

ఇండస్ట్రీలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, సహచరులకు కూడా చిరంజీవి అండగా నిలుస్తుంటారు. చాలాసార్లు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చి సహాయం చేయడమే కాకుండా, అవసరమైతే వారి వైద్య చికిత్సల బాధ్యత కూడా తీసుకుంటారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలు జరిగే సందర్భాల్లో చికిత్స సరిగ్గా జరుగుతుందా అనే విషయాన్ని కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు.

డబ్బులు ఇవ్వడమే కాదు.. వైద్య చికిత్సల విషయంలో కూడా చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ చూపుతారని సమాచారం. రోగులు ఇప్పటికే చికిత్స పొందుతున్న ఆసుపత్రులు, వైద్యులపైనే ఆయన ఎక్కువగా నమ్మకం ఉంచుతారు. ఎందుకంటే, ఆ కేసు గురించి పూర్తిగా తెలిసిన డాక్టర్లే సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన భావిస్తారు. అందుకే రోగుల ఎంపికను గౌరవిస్తూ, అదే ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగేందుకు సహాయం చేస్తారు చిరంజీవి.

అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తన కోడలు ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో ఆసుపత్రి వైపు రోగులను పంపిస్తారని తెలుస్తోంది. అక్కడ రోగులకు మెరుగైన సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట. చిరంజీవి సిఫార్సుతో వచ్చిన కేసులపై ఆసుపత్రి సిబ్బంది కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారని సమాచారం. మొత్తం చికిత్స అయ్యే ఖర్చులో ఎలాంటి డిస్కౌంట్లు లేదా ఉచిత చికిత్సలను ఆశించరని సమాచారం.

ఆసుపత్రి బిల్లులు ఎంత వచ్చినా, చివరి పైసా వరకు తన సొంత డబ్బులతోనే చెల్లిస్తారు. తన పరిచయం వల్ల ప్రత్యేక తగ్గింపు పొందడం ఆయనకు ఇష్టం ఉండదని తెలుస్తోంది. అన్ని చేస్తున్నా కూడా, చిరంజీవి ఎప్పుడూ తన సేవలను బయట చెప్పుకోవడం చేయరు. తన సహాయం వల్ల లబ్ధి పొందినవారే బయట చెప్పినప్పుడు మాత్రమే ఆ విషయాలు వెలుగులోకి వస్తాయి. లేకపోతే మెగాస్టార్ చేసిన సహాయం చాలా వరకు తెలియకుండా మిగిలిపోతుంది. ఏదేమైనా నటుడిగా మాత్రమే కాదు, ఓ మంచి మనసున్న మనిషిగా కూడా చిరంజీవి ఎంతో గొప్ప పొజిషన్ లో నిలిచారు. ఆయన చేస్తున్న సేవలు సమాజానికి ఎప్పుడూ ఆదర్శమే.

Tags:    

Similar News