బ్లడ్ బ్యాంక్ ఆరోపణలు.. ఇన్నేళ్ల తర్వాత చిరు మళ్లీ..

ఇలాంటి విమర్శలు చేయడం మూర్ఖత్వమని అన్నారు. దీంతో చిరు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2026-09-22 11:13 GMT

ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తగ్గలేదు. కొన్నేళ్ల క్రితం తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదంపై ఇప్పుడు మరోసారి చిరు తనదైన స్టైల్‌ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రక్తాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలను ఖండించారు. ఇలాంటి విమర్శలు చేయడం మూర్ఖత్వమని అన్నారు. దీంతో చిరు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ, సినిమాల్లో తాను తీసుకునే రెమ్యూనరేషన్ తో సమానమైన డబ్బు సంపాదించాలంటే ఎన్ని కోట్ల రక్తం ప్యాకెట్లు అమ్ముకోవాల్సి వస్తుందో ఆలోచించాలని అన్నారు. ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా తన కష్టార్జితంతో బ్లడ్ బ్యాంక్‌ ను నడుపుతున్నట్లు చెప్పారు. ఆ సేవా కార్యక్రమానికి అభిమానులు ఎంతో కోపరేట్ చేస్తున్నారని తెలిపారు.

ఆ వివాదం అసలు 2011లో మొదలైంది. అప్పట్లో నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అభిమానులు, ప్రజలు ఉచితంగా దానం చేసిన రక్తాన్ని డబ్బులకు అమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. దీంతో అప్పట్లో ఆ వ్యవహారం టాలీవుడ్‌ లో పెద్ద చర్చగా మారింది.

వివాదం ముదరడంతో అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు బ్లడ్ బ్యాంక్ రికార్డులు, నిధులు, నిర్వహణ వ్యవహారాలను చెక్ చేశారు. విచారణ అనంతరం బ్లడ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తోందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లీగల్ ప్రాసెసింగ్ ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఆ తర్వాత వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. బ్లడ్ బ్యాంక్‌ పై చేసిన ఆరోపణలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొంటూ నిర్మాత అల్లు అరవింద్.. రాజశేఖర్, జీవితపై పరువు నష్టం కేసు వేశారు. ఆ కేసులో 2023లో నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంటూ రాజశేఖర్, జీవితకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. అయితే పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా వారికి బెయిల్ లభించింది.

ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు వెనుక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఒక రోజు పేపర్‌ లో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త చదివినట్లు చిరంజీవి గతంలో చెప్పారు. ఇంత మంది ప్రజలు ఉన్నప్పటికీ.. ఆపదలో ఉన్నవారికి అవసరమైన సమయంలో రక్తం ఎందుకు దొరకడం లేదనే ఆలోచన తనను వెంటాడిందన్నారు. ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అలా 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైంది. అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు వచ్చారు. ఆ సేవా కార్యక్రమం ద్వారా ఎంతోమందికి రక్తం అందేలా సంస్థ పనిచేస్తోంది. సినిమా సక్సెస్ ఇచ్చే ఆనందం కంటే.. ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసినప్పుడు కలిగే సాటిస్ఫికేషన్ చాలా గొప్పదని చిరంజీవి గతంలో చెప్పారు.



Tags:    

Similar News