చిరు - బాలయ్య మల్టీస్టారర్: రాజమౌళి తలుచుకున్నా అది సాధ్యం కాని కలేనా?

మెగాస్టార్ చిరంజీవి- న‌ట‌సింహ‌ బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో రెండు సమాంతర ధృవాలు వంటివారు.

Update: 2026-10-18 19:30 GMT

మెగాస్టార్ చిరంజీవి- న‌ట‌సింహ‌ బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో రెండు సమాంతర ధృవాలు వంటివారు. దశాబ్దాలుగా టాలీవుడ్‌ను తమ భుజస్కంధాలపై మోస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఇద్దరు దిగ్గజాలు ఒక్కసారైనా వెండితెరను పంచుకుంటే చూడాలని కోరుకోని అభిమాని ఉండడు. దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న అరుదైన కాంబినేషన్ కోసం తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కోట్లాది మంది అభిమానుల కల నిజమయ్యే అవకాశం ఉందా? అంటే టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాధానం అసాధ్యం అనే వస్తోంది.

ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే సత్తా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఉందని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ చిరంజీవి స్వయంగా బోయపాటికి అవకాశం ఇచ్చినా? ఇద్దరు హీరోల స్థాయిని.. వారి మాస్ ఇమేజ్‌ను ఒకే ఫ్రేమ్‌లో బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సామే అవుతుంది. ఇటీవల కోలీవుడ్ ట్రెండ్‌కు తగినట్లుగా నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కానీ విభిన్న కథాంశాలతో దూసుకుపోయే ఇలాంటి దర్శకులు సైతం చిరు- బాలయ్య లాంటి లెజెండ్స్‌ను ఒకే సినిమాకు ఒప్పించడం.. వారి అభిమానుల అంచనాలను అందుకోవడం అసాధ్యమనే చెప్పాలి.

ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజ‌మౌళి తలుచుకుంటే సాధ్య మవుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జక్కన్న లాంటి మాస్టర్ మైండ్ డైరెక్టర్ రంగంలోకి దిగినా? ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కడం కష్టమేననే బలమైన వాదన వినిపిస్తోంది. రాజమౌళి సినిమాలకు చాలా ఏళ్ల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇతర కట్టుబాట్లు, రాజకీయ బాధ్యతలు, వరుస కమిట్‌మెంట్ల మధ్య రాజమౌళి టైమ్ టేబుల్‌కు సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యమైన విషయమే.

అంతే కాదు ఈ కాంబినేషన్ వెనుక లెక్కలు ఎంతో క్లిష్టంగా ఉంటాయి. కథా చర్చల దగ్గరి నుంచి స్క్రీన్ స్పేస్, పాత్రల ప్రాధాన్యత, డైలాగులు, పారితోషికాలు, చివరికి టైటిల్ కార్డ్స్ వేసే విధానం వరకు ప్రతి విషయంలోనూ చాలా సమీకరణాలు ముడిపడి ఉంటాయి. ఇండస్ట్రీలో చిరంజీవి ఒక సందర్భంలో బాలయ్యతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. అయితే ఈ విష‌యంపై మాత్రం బాలకృష్ణ ఏ సంద‌ర్భఃలోనూ స్పందించ‌లేదు.

ఇద్దరు దిగ్గజ హీరోల చరిష్మా, వారి మార్కెట్ పరిధి విభిన్నంగా ఉంటాయి. ఒకే సినిమాలో ఇద్దరు హీరోలను సరిసమానంగా చూపించడం ఏ ఒక్కరి అభిమానులకు కూడా అసంతృప్తి కలగకుండా స్క్రిప్ట్ సిద్ధం చేయడం ఏ దర్శకుడికైనా అగ్నిపరీక్షే. సినిమా విడుదలైన తర్వాత వ‌చ్చే పోలికలు, కలెక్షన్ల ప్రచారాలు కూడా ఇరువర్గాల మధ్య అనవసరమైన చర్చలకు..వివాదాల‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి అనేక వ్యాపార, వ్యూహాత్మక కారణాల వల్ల టాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ సాహసానికి ముందుకు రారనేది స్పష్టమవుతోంది.

మొత్తానికి కాలం ఎంతో మారుతున్నా? చిరు-బాలయ్య మల్టీస్టారర్ అనేది కేవలం వెండితెరపై అందని ద్రాక్షలాగే మిగిలిపోనుంది. ఏళ్ల తరబడి ఇండస్ట్రీని ఏలుతున్న ఇద్దరు మహానటులు కలిసి నటిస్తే చూడాలనే కోరిక అభిమానుల గుండెల్లో ఆలోచనగానే.. ఒక కలగానే మిగిలిపోతుందే తప్ప వాస్తవ రూపం దాల్చడం ప్రస్తుత పరిస్థితులలో అసాధ్యమనే చెప్పాలి.

Tags:    

Similar News