స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు.. ఘటనలో డ్రైవర్‌కి గాయాలు!
కొంత కాలంగా ముంబైలో గ్యాంగ్ స్టర్ యాక్టివిటీస్ ప్రమాదకరంగా మారుతున్న సంగతి తెలిసిందే.
కొంత కాలంగా ముంబైలో గ్యాంగ్ స్టర్ యాక్టివిటీస్ ప్రమాదకరంగా మారుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలపై కాల్పులతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్, అతడి కుటుంబం సహా పలువురు స్టార్లకు గ్యాంగ్ స్టర్ల నుంచి సీరియస్ వార్నింగులు వెళ్లాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపు ఘటన తీవ్ర ప్రకంపనాలు రేపుతోంది.
ఆదివారం సాయంత్రం ముంబైలోని రద్దీగా ఉండే జుహు ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జుహు పోలీసు స్టేషన్ పరిధిలోని పుష్పా పార్క్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫుట్‌బాల్ సెషన్ ముగించుకుని గ్రౌండ్ నుండి తన కారులో బయలుదేరుతున్న సమయంలో గుంపులో నుండి కారును లక్ష్యంగా చేసుకుని మూడు నుండి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడగా.. ఈ ఘటనలో అతడి డ్రైవర్ చేతికి గాయమవడంతో చికిత్స నిమిత్తం నానావతి ఆసుపత్రికి తరలించారు.
కాల్పుల బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఈ సంచలన దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా కథనాలొచ్చాయి. సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నవారిని లేదా అతడితో కలిసి పనిచేసేవారినే లక్ష్యంగా చేసుకుని ఈ హెచ్చరిక దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన బెదిరింపులు.. సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల గాలింపు చర్యలు- దర్యాప్తు
ఈ ఘటనపై ముంబై పోలీసులు - క్రైమ్ బ్రాంచ్ అధికారులు తీవ్రంగా స్పందించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు? ఈ పథకం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
భద్రత కట్టుదిట్టం...
ఈ తీవ్రమైన భద్రతా లోపంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా స్పందించారు. ముంబై పోలీస్ కమీషనర్‌తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరా తీశారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీల భద్రతను సమీక్షించి మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.